టిడిపికి సొంతంగా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర బాధ్యతలను ముగ్గురు `తిరుగుబాటు’ వైసీపీ ఎమ్యెల్యేలు చేపట్టడంతో అగ్గిమీద గుగ్గిలమై పోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చివరకు అదనుచూసి ఝలక్ ఇచ్చారు.
పాదయాత్ర 145వ రోజున నెల్లూరు రురల్ నియోజకవర్గంలో సోమవారం ప్రవేశించగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎదురెళ్లి స్వాగతం చెప్పారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా ప్రవేశం సందర్భంగా ఆత్మకూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్యెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్వాగతం చెప్పారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఆయనే పాదయాత్ర పనులు చూస్తున్నారు. మరోవంక ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పాదయాత్ర సన్నాహాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో, అనూహ్యంగా జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, జిల్లా ఉపాధ్యక్షుడు ఆనం జయకుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ ను తాడేపల్లి ప్యాలెస్ లో కలుసుకొని, వైసీపీ కండువా కప్పించుకున్నారు.
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నేతలను విస్మరిస్తూ, అవకాశవాద నేతలకు పెద్దపీట వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక విధంగా పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఇంతకాలం టిడిపి శ్రేణులను వేధిస్తున్న వైసీపీ ఎమ్యెల్యేలను ఇప్పుడు అక్కడ చెల్లుబాటు కాకపోవడంతో వచ్చి టిడిపిలో చేరి, సీట్లు పొందుతున్న నేతల పట్ల టీడీపీ శ్రేణులలో నెలకొన్న ఆగ్రవేశాలకు ఆయన చర్య అద్దం పడుతుందని చెప్పవచ్చు.
ఆనం సోదరుల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న జయకుమార్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశించారు. తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీని వీడినా (2019 ఎన్నికలకు ముందు) తను వీడనని చంద్రబాబుకు హామీ కూడా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో జయకుమార్‌రెడ్డికి కీలక పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట.
టీడీపీలో కీలక పదవి దక్కుతుందని భావించినా.. దక్కకపోవడంతో ఆనం జయకుమార్ రెడ్డి నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, క్లిష్ట సమయంలో పార్టీని వీడిన ఆనం రామనారాయణరెడ్డిని తిరిగి టీడీపీలో చేర్చుకోవడంపై ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆనం జయకుమార్ రెడ్డి.. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. తన కుటుంబానికే చెందిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నప్పటికీ- జయకుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
నెల్లూరు లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా నియమితులు కావడంతో ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకనే, ఆయన స్థానంలో ఆనం జయకుమార్ రెడ్డికి నెల్లూరు లోక్‌సభ టికెట్ ఇవ్వొచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.