లోకేష్ పాదయాత్రకు విరామం.. ఫేక్ ప్రచారంపై న్యాయ‌పోరాటం

Saturday, November 23, 2024

2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కిమీ `యువగళం’ పాదయాత్ర జరుపుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యాత్రకు రెండు రోజుల విరామం ఇస్తున్నారు. 13, 14 తేదీలలో యాత్రను నిలిపివేస్తున్నారు. ఆ రెండు రోజులు మంగళగిరి వెడుతున్నారు.

టీడీపీపైన, టీడీపీ నేతలపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ప్రతిఘటించడంతో పాటు తనపై, తన కుటుంబంపై సాగిస్తున్న అసత్య ప్రచారంపై చేపట్టిన న్యాయపోరాటంలో భాగంగా ఈ విరామం తీసుకొంటున్నారు. త‌ప్పుడు వార్తలు రాస్తూ, త‌న‌ని అప్రతిష్టపాలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోందంటూ సాక్షిపై గతంలో ఆయన ప‌రువున‌ష్టం దావా వేశారు.

తాజాగా వైఎస్‌ఆర్‌సిపి నేత‌లు, సోష‌ల్ మీడియా బాధ్యులు కూడా త‌న‌ని టార్గెట్ చేస్తున్నారంటూ క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. 

ఈ కేసులో పిటిష‌న‌ర్ అయిన నారా లోకేశ్ వాంగ్మూలాన్ని మంగ‌ళ‌గిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో 14వ తేదీ శుక్రవారం న‌మోదు చేయ‌నున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ, మంగళవారమే 2,000 కిమీ, అంటే సగం దూరం పూర్తి చేశారు. బుధవారం పాదయాత్ర పూర్తి కాగానే మంగళగిరికి బయలుదేరి వస్తారు. తిరిగి 15వ తేదీ ఉదయం నుండి యధావిధిగా పాదయాత్ర కొనసాగిస్తారు.

లోకేశ్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహ‌త్యపై వైసీపీ సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అంటూ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా విష‌ప్రచారం చేశారు. 

అయితే ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది. అయినా గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్‌లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారు. త‌ప్పుడు రాత‌లపై గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డికి త‌న లాయ‌ర్ దొద్దాల కోటేశ్వర‌రావు ద్వారా నోటీసులు పంపారు. 

గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో – ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్‌గా ప‌నిచేస్తుండ‌డంతో ఆయా కార్యాల‌యాల‌కు నోటీసులు పంపగా వారు నిరాకరించారు. చివ‌రకి గుర్రంపాటికి వాట్స‌ప్ ద్వారా నోటీసులు పంపారు.

ఇలా ఉండగా, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కి.మీ పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ‘యువగళం’ సైకిత చిత్రాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసి హీరో అయ్యారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. లోకేశ్ ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకుంటూ దిగ్విజయంగా ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles