తండ్రి వారసత్వంగా తెలుగు దేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు నారా లోకేష్ చేపట్టిన `యువగళం’ పాదయాత్రలో పలుచోట్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ అంశం కొంతకాలంగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినా చిత్తూరులోనే తలెత్తుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ విషయమై నినాదాలు, గోడమీద రాతలు కూడా గతంలో ప్రత్యక్షమయ్యాయి.
తాజాగా, తిరుపతిలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ ఆహ్వానిస్తుందా? అని ఒకరు నేరుగా లోకేష్ ను ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన `తెలివిగా’గా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తున్నది. “నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ఆ విధంగా చెప్పడం ద్వారా, ఇప్పటి వరకు జూనియర్ టీడీపీలో రీ ఎంట్రీకి లోకేష్ కారణమంటూ జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికే ప్రయత్నం చేసారు.
అయితే, ఇక్కడ ఒక మెలిక పెట్టారు. “ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్ర స్థానానికి వెళ్లాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలి” అంటూ జనరలైజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రసక్తి నుంచి జనం దృష్టి మళ్లించే విధంగా వ్యవహరించారని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాని, ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని మాత్రం మాటవరసకు కూడా తినకపోవడం జనం దృష్టిని ఆకట్టుకుంది.
2009 ఎన్నికలలో టిడిపి ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ రోడ్డు ప్రమాదానికి గురై, ఆసుపత్రిపాలు కావలసి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎక్కడ టిడిపి వేదికలపై కనిపించడం లేదు. అందుకు ఆయన సినిమాలలో తీరిక లేకుండా ఉండటం ఒక కారణమైతే, ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచుతున్నారనే వాదనలు కూడా బయలుదేరాయి.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు గతంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయాలని బహిరంగంగానే సూచించడం జరిగింది. కానీ ఈ విషయమై చంద్రబాబు నాయుడు మౌనం వహిస్తూనే ఉన్నారు. మొదట్లో సినిమాలలో, ఇతరత్రా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రోత్సహిస్తూ వచ్చిన నందమూరి బాలకృష్ణ సహితం చాలాకాలంగా ఆయనను దూరంగానే ఉంచుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే అగ్రశ్రేణి సినీనటుడుగా జనంలో ఒక విధమైన క్రజ్ సంపాదించుకున్నారు. టీడీపీలోకి వస్తే భవిష్యత్ నేతగా ఆయన చుట్టూ పార్టీ శ్రేణులు సమీకృతమయ్యే అవకాశం ఉండనే భయం లోకేష్ వంటి వారితో ఉన్నట్లు కూడా స్పష్టం అవుతుంది.
అయితే, ఇటీవల నందమూరి తారకరత్న విషాదకర పరిస్థితులలో మృతి చెందడంతో మరోసారి టిడిపిలో నందమూరి వారసత్వం అనే ప్రశ్న తలెత్తుతుంది. చంద్రబాబునాయుడు పార్టీలో ఇప్పుడు తిరుగులేని నేత అయినప్పటికీ ఆయనను జనం `నందమూరి వారసత్వం’గా చూడటం లేదు. పైగా, నందమూరి పేరున్నవారిని ఆయన వ్యూహాత్మకంగా దూరంగా నెట్టివేశారనే అపవాదులు కూడా ఉన్నాయి.
నందమూరి హరికృష్ణ వ్యవహారంతో పాటు 2004లో టిడిపిలోకి రావడానికి దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సిద్ధమైతే కుదరదని తేల్చి చెప్పారు. పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా పేరుపెట్టి పలువురు టీడీపీ నాయకులు విమర్శలు కురిపిస్తున్న వారిని కట్టడి చేసే ప్రయత్నం చంద్రబాబు, లోకేష్ చేయలేదు.
నందమూరి బాలకృష్ణ రెండు పర్యాయాలుగా ఎమ్యెల్యేగా ఉన్నప్పటికీ ఆయన కేవలం తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు పైననే ఆసక్తి చూపడం గాని, టిడిపి వ్యవహారాలలో చెప్పుకోదగిన పాత్ర వహించడం లేదు. సినిమాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఓ క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు టిడిపిలో చేరి తనకంటూ ఓ గుర్తింపుకు తాపత్రయపడే అవసరం కనబడటం లేదు.