లైంగిక వేధింపులపై కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న యువతి

Sunday, December 22, 2024

బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొంతకాలంగా నిరసనలు సాగిస్తున్న ఆరిజిన్ డైరీ సంస్థ నిర్వాహకురాలు బోడపాటి శేజల్ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ రాజ్యంలో మహిళలకు రక్షణ లేదంటూ ప్రశ్నిస్తూ, లైంగిక వేధింపులకు పాలపడుతున్న అధికార పార్టీ ఎమ్యెల్యేపై చర్యలు తీసుకోరే? అంటూ నిలదీస్తున్నారు.

ఎమ్యెల్యేకు వంతపాట పాడుతున్న పోలీసులను ఆమె ప్రశ్నిస్తున్నారు. పైగా, ఆమె ఢిల్లీకి వెళ్లి నిరసనలు చేపట్టడం బిఆర్ఎస్ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. కేసీఆర్ నాగపూర్ వెళ్లి అక్కడ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభిస్తూ, దేశం మొత్తానికి `తెలంగాణ మోడల్’ అంటూ ప్రసంగిస్తున్న సమయంలో ఢిల్లీలోని బిఆర్ఎస్ కార్యాలయం ముందు ఈ యువతీ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది.

ఢిల్లీలో ప్రతిరోజూ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపడుతున్న శేజల్ గురువారం ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్‌లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసిన శేజల్, పార్టీ పదవులపై వ్యామోహంతో ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఒక సందర్భంలో ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన గుర్తుచేసిన శేజల్, ఇప్పుడు తన పార్టీకే చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 గత 100 రోజులుగా న్యాయం కోరుతూ తాను చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని  ఆమె  ప్రశ్నించారు. తన గోడు ప్రభుత్వ పెద్దలకు వినిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో న్యాయం జరగడం లేదన్న కారణంగానే తాను ఢిల్లీ వచ్చి గత 25 రోజులుగా నిరసన తెలియజేస్తున్నానని ఆమె చెప్పారు.

కొంతమంది యువతులు కలిసి బెల్లంపల్లిలో స్వయం ఉపాధిగా ఆరిజిన్ డైరీ ప్రారంభించారు. స్థానిక ఎమ్యెల్యేగా అందుకు సహకారం అడిగితే అందులో భాగస్వామ్యం ఇవ్వమని వేధించడం, యువతులలపై లైంగిక వేధింపులకు పాల్పడటం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ‘పక్కలోకి వెళ్లకపోతే వ్యాపారం చేసుకొనీయను’ అన్న రీతిలో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని శేజల్ ప్రశ్నించారు.

తెలంగాణలో వ్యాపారం చేసే స్వేచ్ఛ తమకు లేదా? అంటూ  ఆమె ప్రశ్నించారు. ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా తనను వేధించి, తప్పుడు కేసులు పెట్టించి, రిమాండ్ కి పంపి తన జీవితం సర్వనాశనం చేశారని ఆమె దుయ్యబట్టారు.

ఈ తప్పులకి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించి తక్షణమే చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అలాగే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరుగకపోతే అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్దంగా ఉన్నానని శేజల్ ప్రకటించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles