లిక్కర్‌ స్కామ్ లో కవితపై ఇరకాటంలో బిజెపి పెద్దలు!

Saturday, November 16, 2024

రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ లో పలు అరెస్టులు జరిగినా, పలువురు ప్రముఖుల పేర్లను ఛార్జ్ షీట్ లలో ప్రస్తావిస్తున్నా నిర్దుష్టంగా నగదు బదిలీ జరిగిన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలను సేకరింపలేక పోతున్నాయి.  అందుకనే ఈ మొత్తం వ్యవహారంలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన శరత్ చంద్రారెడ్డి వంటి వారిని అప్రూవర్లుగా మార్చడం కేవలం వారిని సాక్షులుగా చేసుకోవడమే అని స్పష్టం అవుతుంది.

ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను దోషిగా పేర్కొంటూ వస్తున్నా ఆమెను అరెస్ట్ చేసే విషయంలో బిజెపి పెద్దలు ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది.  ఆమెను అరెస్ట్ చేస్తే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి వచ్చే మైలేజ్ ని, రాజకీయంగా జాతీయ స్థాయిలో ఎదురు కాగల ఇబ్బందులను బేరీజు వేసుకోవడంతో తడబాటుకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది.

తాజాగా, ఈ కుంభకోణంలో కవితకు బినామీగా అరుణ్ పిళ్లైగా సిబిఐ, ఈడీలు ఏవిధంగా చిత్రీకరిస్తున్నారో పిళ్ళై న్యాయవాది న్యాయస్థానం ముందే బహిర్గతం చేశారు. ఈ ఆరోపణలను అరుణ్‌ పిళ్లై తరఫు న్యాయవాది కొట్టిపారవేస్తూ పిళ్లైకు ఈ కేసుకు సంబంధంలేదని, ఆయన ఎవరికీ ప్రతినిధి కాదని తేల్చి చెప్పారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్‌ పిళ్లై బెయిల్‌ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తూ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై తన సొంత సొమ్మును పెట్టుబడిగా పెట్టారని కోర్టుకు తెలిపారు. ఎవరూ ఇండో స్పిరిట్స్‌లో పెట్టుబడిగా పెట్టలేదన్నారు.

తన వాంగ్మూలం ఈడీ రికార్డు చేసిన మూడు రోజులకే పిళ్లై దానిని ఉపసంహరించుకోవడం అప్పట్లో కలకలం రేపింది.  దాని గురించి ప్రస్తావిస్తూ, ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని సంతకం చేయాల్సి వచ్చిందని పిళ్లై తరఫు న్యాయవాది చెప్పారు.

ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారని పేర్కొంటూ వాంగ్మూలం ఉపసంహరించుకున్నారంటూ పిళ్లై బెయిల్‌ ను వ్యతిరేకించడం సరికాదని తెలిపారు. అంటే ఈ కేసులో కవితను అరెస్ట్ చేయడం కోసం బిజెపి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. కవిత నేడో, రేపో అరెస్ట్ కాబోతున్నారంటూ బండి సంజయ్ నుండి పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ప్రకటనలు కూడా ఇస్తూ వచ్చారు.

అయితే కవితను అరెస్ట్ చేసినంత మాత్రంచేత తెలంగాణాలో బిఆర్ఎస్ కుప్పకూలిపోదని, పైగా ఎన్నికల సమయంలో దానిని కేసీఆర్ సానుభూతి అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ప్రధానంగా ఆప్ అగ్రనాయకులు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు.

ఈ స్కామ్ కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నెల 4న దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాత్రపై ప్రధానంగా అభియోగాలను వివరించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు బిజెపి, కాంగ్రెస్ లకు సమదూరం పాటిస్తూ, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తూ, తమకు పరోక్షంగా సహకరిస్తున్న కేజ్రీవాల్ పట్ల బీజేపీ నాయకత్వం ఒకింత సానుభూతితో వ్యవహరించింది. కానీ, ఢిల్లీ పాలన అధికారుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకించేందుకు మద్దతుగా కాంగ్రెస్ వెంట వెళ్లేందుకు కేజ్రీవాల్ సిద్దపడటంతో బిజెపి కన్నెర్ర చేసినట్లు స్పష్టం అవుతుంది.

దీనినే అవకాశంగా తీసుకొని సీఎం కేసీఆర్ తన కుమార్తెపై చర్య తీసుకోకుండా బిజెపి నాయకత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సహాయంతో  శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చుకొనే ఈ కేసును బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కవితపై చర్య తీసుకొంటే తాను కూడా బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దగ్గరకు వీడతానని కేసీఆర్ హెచ్చరికలు పంపినట్లు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles