లిక్కర్ స్కాంలో అసలు గురి కేసీఆర్!

Tuesday, November 5, 2024

రాజకీయ  ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిందితులుగా పేర్కొన్న రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాత్రమే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు సీబీఐ నోటీసు ఇవ్వడంతో ఆమెపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు స్పష్టం అవుతుంది. 

ప్రస్తుతం కేవలం ఓ సాక్షి తరహాలో, అనుమానాల నివృత్తి కోసం మాత్రమే ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా సిబిఐ చెబుతున్నప్పటికీ త్వరలో ఈడీ ఆమెను ప్రశ్నించి,  నిందితురాలిగా చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం ఆమెతో మాత్రమే సరిపుచ్చాని, బిజెపి నేతల అసలు లక్ష్యం  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలుస్తున్నది. 

కవితకు సీబీఐ నోటీసులు ప్రంపడంపై స్పందిస్తూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్  ఈ కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, కేజ్రీవాల్ ప్రభుత్వం పాత్ర ఉందని స్పష్టం చేశారు . 

 సీబీఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలని చెబుతూ సీఎం కేసీఆర్, కవిత.. పదే పదే ఢిల్లీకి ఎందుకు వచ్చారో కూడా చెప్పాలని బిజెపి నేత నిలదీశారు. ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బిజెపి కీలక నేత బి ఎల్ సంతోష్ పై కేసీఆర్ ప్రభుత్వం గురిపెట్టడంతో కవిత పేరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ తమ దారికి రాని పక్షంలో కవితను అరెస్ట్ చేయడంతో పాటు, కేసీఆర్  ను సహితం ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమనితెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  జోస్యం చెప్పడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. ఈ మేరకు బీజేపీ నుంచి పరోక్షంగా సంకేతాలు వచ్చాయని ఆయన తెలిపారు. అయితే, కేవలం  విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 

లిక్కర్ స్కాం కేసులో వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కవిత అరెస్ట్‌కు రంగం సిద్దమైందంటూనే ఆమెను సిబిఐ ఇప్పుడు అరెస్ట్ చేయకపోవచ్చని చెప్పడం ద్వారా తదుపరి ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. 

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసుకోవాలని, తాను దేనికైనా సిద్దమంటూ కవిత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, కానీ ఆమె లోపల భయం కనిపిస్తుందని జగ్గారెడ్డి తెలిపారు. ఎవరికైనా భయం ఉంటుందని, కవిత కూడా భయపడుతుందని పేర్కొంటూ కవిత స్థానంలో తాను ఉన్నా భయపడతానని అంటూ సానుభూతి వ్యక్తం చేశారు. 

సిబిఐ సూచించిన విధంగా విచారణకు తన ఇంట్లో అందుబాటులో ఉంటానని ప్రకటించిన కవిత, శనివారం తండ్రి కేసీఆర్, న్యాయనిపుణులతో సుదీర్ఘంగా సంప్రదింపులు చేసిన అనంతరం ఓ మెలిక పెట్టారు. న్యాయవాదుల సూచనలతో మెలిక పెడుతూ సీబీఐకి కవిత లేఖ రాసింది. హోంశాఖ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలని కోరారు. వివరాలు ఇచ్చిన తర్వాతే విచారణ తేదీని ఫిక్స్ చేయాలని సీబీఐకి పంపిన లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles