రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసులు, రైతుల మధ్య తోపులాట!

Wednesday, January 22, 2025

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి అంబేడ్కర్‌ స్మృతివనానికి పాదయాత్ర తలపెట్టిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి ఆర్-5 జోన్‌లో సెంటు భూమి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయానికి అమరావతి రైతులు నిరసన తెలుపుతూ ఆర్-5 జోన్‌లో లేఔట్ పనులు చేపట్టకుండా గత కొద్ది రోజులుగా అడ్డుకుంటున్నారు. పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ నిరసన తెలుపుతున్నారు.

జైభీమ్‌’ పార్టీ వ్యవస్థాపకుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేశారు. ఆయనకు సంఘీభావం తెలియజేసేందుకు అంబేడ్కర్‌ స్మృతివనం వద్దకు రైతులు బయల్దేరగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు.  శిబిరం వెనుకవైపు పొలాల నుంచి వెళ్లేందుకు కొందరు రైతులు యత్నించగా వారిని పోలీసులు నిలువరించారు.

పొలాల వెంట వెళ్తున్నవారితో పాటు శిబిరం నుంచి బయటకు వచ్చిన మరికొందరు రైతులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం నుంచి రైతులు, మహిళలు, రైతు కూలీలను బయటికి రానివ్వకుండా పోలీసులు అడ్డుగా నిలబడ్డారు. పోలీసులను తోసుకొని బయటికి రావడానికి రైతులు ప్రయత్నించారు.  ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య శిబిరం దగ్గర తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. జడ శ్రావణ్‌కుమార్‌ పాదయాత్రకు అనుమతివ్వలేదని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు చెప్పారు. రైతుల ఆందోళనతో ఆ తర్వాత పరిమిత సంఖ్యలో స్మృతివనంకు వెళ్లేందుకు అనుమతించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం అమరావతి జేఏసీ నాయకులు స్మృతివనం వద్దకు వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నినాదాలు చేసి నిరసన తెలిపారు.

ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన అర్హులైన పేదలకు రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్ లో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించింది. ఈమేరకు రెండు జిల్లాల్లోని ఉన్నతాధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆర్-5 జోన్ లో ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణం జరగాల్సి ఉందని, తాము స్వచ్ఛందంగా భూములిచ్చింది రాజధాని నిర్మాణం కోసమేనని అన్నదాతలు చెబుతున్నారు.

ఇళ్ళస్థలాలివ్వాలనుకుంటే ప్రభుత్వం ఆర్-3 జోన్ పరిధిలో ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో రైతుల అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వారంలో విచారణ జరగనుంది. మరోవంక, దొండపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను బలవంతంగా వాహనంలోకి పోలీసులు ఎక్కించారు. పేదలకు సెంటు భూమి పంపిణీ చేయడానికి ప్రభుత్వం మరో 268 ఎకరాలను కేటాయించింది.

ఈ క్రమంలో శుక్రవారం పిచ్చుకలపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లోని భూముల్లో జంగిల్‌ క్లియర్‌ చేయడానికి సీఆర్‌డీఏ ఎక్స్‌కవేటర్లను రంగంలోకి దించింది. విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు అక్కడికి చేరుకొని జంగిల్‌ క్లియర్‌ పనులను అడ్డుకున్నారు. దొండపాడు సమీపంలో పనులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పెట్రోల్‌ సీసాలతో ఆందోళనలు చేపట్టారు.

చావడానికైనా సిద్ధపడతాం కాని పనులు చేస్తే ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళల వద్ద పెట్రోల్‌ సీసాలను లాక్కోవడానికి తుళ్లూరు సీఐ ఆనందరావు ప్రయత్నించారు. దీంతో సీసాలలోని పెట్రోల్‌ మహిళలపై పడటంతో పాటు, సీఐ కళ్లలోనూ పడింది. అక్కడే ఉన్న పోలీసులు, రైతులు, మహిళలు అప్రమత్తమై వారిపై కండువాలు కప్పి ప్రమాదం జరగకుండా చూశారు.

సీఐ కళ్లలో పెట్రోల్‌ పడడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికి మహిళలను కూడా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇతర మహిళలు, రైతులు నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో జంగిల్‌ క్లియర్స్‌ను అడ్డుకున్నారు. పోలీసులు వారించినా వినలేదు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కాగా, దొండపాడులోనూ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై టెంటు వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. నెక్కల్లులో జేసీబీలను అడ్డుకున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles