రేవంత్ రెడ్డి యాత్రకు సీనియర్లు మోకాలడ్డు

Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీ ఓ విచిత్రమైన పార్టీ. నాయకులకు ఎవ్వరి దారి వారిదే. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటారు. అంతలోనే అంత ఒక్కటే అంటూ గ్రూప్ ఫోటో దిగుతారు. చాలాకాలంగా అధికారంకు దూరంగా ఉండవలసి వచ్చినా వారి ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. మరోకొద్దీ నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయంవైపు నడిపించేందుకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సహితం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటున్నది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణాలో హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు.

 ములుగు నుంచి ప్రారంభించిన ఈ యాత్ర పట్ల మరోసారి సీనియర్ నేతల ధోరణి గందరగోళంగా తయారైంది. మేడారం వేదికగా రేవంత్ తన పాదయాత్రను ప్రారంభించగా భారీ ఎత్తున కార్యకర్తలు, స్థానిక నేతలు తరలివచ్చినప్పటికీ ఒకరిద్దరు మినహా సీనియర్ నేతలు మాత్రం రాలేదు. కనీసం ప్రారంభం రోజైనా రాకపోవటం ఏంటన్న చర్చ మొదలైంది.

నిజానికి పాదయాత్ర విషయంలో మొదటినుండి సీనియర్ నాయకులు భిన్నస్వరాలు వినిపిస్తూనే ఉన్నారు. భద్రాచలం నుంచి ప్రారంభం కావాల్సిన యాత్ర అంతర్గత కుమ్ములాటలు కారణంగా ములుగుకు మారింది. యాత్రలో
ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వాఖ్య పెనుదుమారం రేపింది.  దీనిపై బీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడి చేటున్నారు.

అయితే ఏ ఒక్క కాంగ్రెస్ సీనియర్ నేత మాత్రం రేవంత్ కు మద్దతుగా మాట్లాడలేదు. రేవంత్ అనుచరులు, మద్దతుదారులు మాత్రం… రేవంత్ కామెంట్స్ లో తప్పులేదని అంటున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ… నక్సలైట్లు అజెండానే తనది అన్న కేసీఆర్ ను ఎలా సమర్థించారని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే వారు ఆలోచించుకోవాలంటూ హితవు పలికారు.

ఈ వ్యాఖ్యలపై అటు అధికార పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాటు పలుచోట్ల  పోలీసులకు ఫిర్యాదులు కూడా నమోదవడంతో రేవంత్ ఓ మెట్టు కిందకు దిగిన్నట్లు కనిపిస్తున్నది. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ పేరు మారుస్తామంటూ మాటమార్చారు. 

నిజానికి ప్రస్తుతం ఒక వంక పార్లమెంట్ సమావేశాలతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో యాత్ర ఏవిధంగా ప్రారంభించారని ప్రశ్న తలెత్తుతుంది.  ఆ సాకుతో పలువురు సీనియర్ నేతలు యాత్రకు దూరంగా ఉంటున్నారు.  ప్రస్తుతం ములుగులో పూర్తి కాగ, మహబూబాబాద్ నియోజకవర్గంలో జరుగుతోంది.

అయితే రాబోయే రోజుల్లో ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సాగే యాత్రకు వారి నుంచి ఎలాంటి సహకారం ఉంటుందనేది చూడాలి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం స్పందిస్తూ  ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ నెల 13 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొననున్నట్టు ప్రకటించారు.

పాదయాత్ర చేయటం వల్ల అన్ని గ్రామాలను టచ్ చేయలేమన్న కోమటిరెడ్డి త్వరలోనే తాను  బైక్ యాత్ర చేస్తానని వెల్లడించారు. నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి.. నాలుగు జిల్లాలను కలుపుకుని బైక్ యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles