తెలంగాణ అయితే ఉచిత విద్యుత్ గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలకు దిగారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను కూడా తగలపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటలే విద్యుత్ లభిస్తుందంటూ ప్రజలను హెచ్చరించారు.
మరోవంక, రేవంత్ రెడ్డి వాఖ్యాలను వక్రీకరించి బిఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ కాంగ్రెస్ శ్రేణులు సహితం పలుచోట్ల నిరసనలు చేపట్టారు. బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు.
ఊరూరా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వబోమని ఎమ్యెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి ఆమె నిరసన తెలిపారు.
రైతుల పొట్టకొట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపిచ్చారు. నిర్మల్ పట్టణంలో కరెంట్ కార్యాలయం ముందు రోడ్ పై బైఠాయించి కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. రైతులతో కలిసి రహదారిపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
కేసీఆర్ మూడు పంటల గురించి ఆలోచిస్తుంటే, కాంగ్రెస్ మూడు గంటలే ఉచిత విద్యుత్ ఇస్తామంటోందని మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడైనా సరే సబ్ స్టేషన్ కు వెళ్లి అక్కడ లాక్ బుక్కుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని రుజువు చేస్తే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తానని చెప్పారు.
తల్లాడ మండలం, మల్లవరం గ్రామంలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులతో కలసి మల్లవరం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. బీఆర్ఎస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఉచిత విద్యుత్తును అడ్డంపెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారని, రైతులకు 24 గంటల కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానమని రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించినందుకు నిరసనగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.