రేవంత్ పై కౌంటర్ తో బండి సంజయ్ కు ఈటెల చెంపపెట్టు!

Wednesday, December 18, 2024

సైద్ధాంతిక ఉద్యమ నేపథ్యంలో నుండి వచ్చిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ మాటల కూర్పులో నేర్పరి. ఒకే మాటతో పలువురికి, పలు రకాల సమాధానాలు చెప్పడంలో సిద్ధహస్తుడు. తాజాగా, మునుగోడు ఎన్నికల సమయంలో  బీఆర్‌ఎస్ నుంచి రూ  25 కోట్ల నిధులు కాంగ్రెస్ కు అందాయని ఈటల చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఈ ఆరోపణలపై రెచ్చిపోయిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం అంటూ ఈటెలకు సవాల్ విసిరారు. చెప్పినట్టుగానే శనివారం సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లి అమ్మవారి సాక్షిగా  భావోద్వేగంతో ప్రమాణం చేశారు. అయితే, రేవంత్ రెడ్డి చేసిన సవాళ్లకు గాని, ప్రతి విమర్శలకు గాని స్పందించకుండా ఈటెల మాత్రం ప్రశాంతంగా ఇంట్లోనే గడిపారు.

అయితే, పలువురు బిజెపి నేతలు రేవంత్ పై దండయాత్ర చేస్తూ ఆరోపణలు చేశారు అనుకోండి. రేవంత్ ప్రమాణం పూర్తయిన తర్వాత “గుళ్లకు వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఇదేమి కల్చర్?” అంటూ ఎద్దేవా చేశారు. ఇది ఓ రాజకీయవేత్త చేసే పనా? అన్నట్లు నిలదీశారు. రాజకీయాలలో రాజకీయంగా పోరాడాలి గాని గుళ్ళలో ఓట్లు పెట్టుకుంటారా అన్నట్లు సున్నితంగా చివాట్లు పెట్టారు.  

ఈ మాట రేవంత్ రెడ్డికి కౌంటర్ గా అన్నట్లు కనిపించినా, ఆయన వేసిన బాణం మాత్రం మరోచోట తగిలిన్నట్లు స్పష్టం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఏ అంశం తలెత్తినా రాజకీయ ప్రత్యర్థులను భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి వద్ద ప్రమాణం చేద్దామా? అంటూ తరచూ సవాళ్లు విసురుతున్నది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కావడం గమనార్హం.

 తాజాగా, టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో తనను మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ను సహితం ఈ విధంగా ప్రమాణం చేద్దాం వస్తావా? అంటూ సంజయ్ సవాల్ చేశారు.

ఇప్పుడు రాజేందర్ కౌంటర్ సహితం నేరుగా సంజయ్ కే తగిలినట్లయింది. తాను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదని, ఆత్మసాక్షిగానే చెప్పానని ఈటల రాజేందర్ తెలిపారు. తాను ఎవరినీ కించపరిచే వ్యక్తిని కాదని, గాయపరిచే మనిషి కాదని చెబుతూ తాను వ్యక్తుల కోసం మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

“ఓ రాజకీయ నేతకు కావాల్సింది ఆత్మవిశ్వాసం.. నీ మీద నీకు నమ్మకం లేకపోతేనే కదా దేవుడిపై విశ్వాసం. గుళ్లకు వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఇదేమి కల్చర్? ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడిన. ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేదు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌ రెడ్డి పోరాడడం లేదని నేను అనలేదు. తాటాకు చప్పుళ్లకు భయపడే రకం ఈటల కాదు. నిజమెంతో, అబద్ధమేంటో ప్రజలే తేలుస్తారు. నా ఆత్మ సాక్షి ప్రకారమే నేను మాట్లాడా.” అంటూ ఈటల రాజేందర్ సున్నితంగా చివాట్లు పెట్టారు.

ఆయన చివాట్లు అన్ని తెలంగాణాలో అందరికన్నా ఎక్కువగా బండి సంజయ్ కే వర్తిస్తాయి అనడంలో సందేహం లేదు. మొదటగా, జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా వరదసహాయం ఆపివేయమని కేంద్రానికి బండి సంజయ్ లేఖ వ్రాసాడని బిఆర్ఎస్ నేతలు ఆరోపించినప్పుడు ఇటువంటి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ను భాగ్యలక్షి ఆలయంకు వచ్చి తనతో పాటు ప్రమాణం చేయమని సవాల్ చేశారు.

ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు కూడా యాదాద్రికి వెళ్లి బండి సంజయ్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశంలో బీజేపీ కి సంబంధం లేదు అని తడిబట్టలతో ప్రమాణం చేశారు. సిట్ దర్యాప్తులో బలమైన ఆధారాలు లభించడంతో ఆ ప్రమాణాలు నవ్వులపాలయ్యాయి అనుకోండి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles