రేవంత్ కు పోటీగా తెరపైకి భట్టి విక్రమార్క!

Wednesday, January 22, 2025

కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన `ప్యుపూల్స్ మార్చ్’ ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం భారీ బహిరంగ సభ జరపడం, దానిలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనడం ద్వారా ఒక విధంగా కొద్దీ నెలల్లో జరుగబోవు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తున్నట్లు అవుతుంది.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా చేరే సందర్భంగా ఈ బహిరంగసభను తలపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అడ్డొచ్చి, భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభగా మార్చారు. రెండు వేర్వేరు సందర్భాలు కావడంతో విడివిడిగా బహిరంగసభలు జరిపే విధంగా మొదట్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు.

అయితే, నేరుగా రాహుల్ గాంధీని కలిసి ఒకే సభగా మార్చి, విక్రమార్క యాత్ర ముగింపు సభలో పొంగులేటి తదితరులు కాంగ్రెస్ లో చేరే విధంగా మార్చారు. ఆ విధంగా చేయడం ద్వారా పొంగులేటి బృందం కాంగ్రెస్ లో చేరే ప్రాధాన్యతను తగ్గించడంతో పాటు, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకు ఎత్తుగడ వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

తామంతా సహాయ నిరాకరణ కావిస్తున్నా టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకు పోతుండడం కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు అసహనం కలిగిస్తున్నది. ముఖ్యంగా కేసీఆర్ తో లోపాయికారి అవగాహన గల నేతలుగా పేరొందిన సీనియర్ నేతలకు కేసీఆర్ ను ఛాలెంజ్ చేసే నేతగా రేవంత్ ఎదగడం ఏమాత్రం మింగుడు పడటం లేదు. అందుకనే వ్యూహాత్మకంగా కొంతకాలంగా భట్టి విక్రమార్క ను రేవంత్ కు పోటీగా ప్రోత్సహిస్తున్నారు.

మూడుసార్లు వరుసగా ఎమ్యెల్యేగా గెలుపొందిన విక్రమార్క కాంగ్రెస్ కుటుంభ నేపథ్యం నుండి వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం నుండి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  ముందుగా రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తే, ఆయనకు పోటీగా విక్రమార్క తో ప్రారంభింప చేశారు. రేవంత్ యాత్రకు సహకరించని నేతలు ఆయనకు సహకారం అందించారు.

మరోవంక, బిఆర్ఎస్ నేతలు సహితం వ్యూహాత్మకంగా నిత్యం రేవంత్ రెడ్డిపై విరుచుకు పడుతూ, భట్టి విక్రమార్క పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ వేదికపైననే ఆయనను కొన్ని సందర్భాలలో కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన డబల్ బెడ్ రూమ్ లపై విమర్శలు గుప్పిస్తే నేరుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఇంటికి వెళ్లి మరీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ విధంగా మరే ప్రతిపక్ష నేతతో అధికార పక్షం వ్యవహరింపక పోవడం గమనార్హం.

తెలంగాణాలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టుదలగా ఉన్నారు. అటువంటి సమయంలో భట్టి విక్రమార్కను తెరపైకి తెచ్చేందుకు సిద్దపడుతున్నారు. ఆయన ఎస్సి వర్గం నేత కావడం, కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఎస్సి నేత కావడంతో, దేశంలో ఒక ఎస్సీని  ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లు కాగలదని రాహుల్ గాంధీ కూడా ఒప్పుకోవచ్చని వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేస్తున్నారు.

మరోవంక అనుకోని పరిస్థితుల్లో అధికారం కోల్పోతే రేవంత్ రెడ్డి వంటి వారు ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ కు సహితం ఆందోళన కలిగించే అంశం. తమ ప్రభుత్వంలోని అక్రమాలు అన్నింటిని బయటకు తీస్తారని భయం ఉంది. అందుకనే భట్టి విక్రమార్క వంటి వారి ద్వారా తమకు అనుకూలమైన కాంగ్రెస్ సీనియర్లు ఆ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే విధంగా చేసుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles