రేవంత్‌రెడ్డి కనిపించడం లేదంటూ పోస్టర్ల కలకలం

Thursday, September 19, 2024

తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్‌ నుంచి, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే నేతల సంఖ్య పెరుగుతోంది. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా కొంచెం హుషారుగా కనిపిస్తున్నారు. కర్ణాటక తరహాలోనే ఎలాగైనా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి కనిపించడంలేదని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పలుచోట్ల గోడలపై అతికించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

రెండు వారాలుగా వర్షాలతో నగరం అతలాకుతలమై పోతుంటే ఎంపీగా ముఖం చూపించడం లేదంటూ ప్రచారం జరుగుతుంది.  2020లో నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తినప్పుడు నియోజకవర్గంలో సందర్శించలేదని, ఇప్పుడు కూడా వరద బాధితులను పరామర్శించడానికి రాలేదని విమర్శలు చెలరేగుతున్నాయి. వరద బాధితులను పట్టించుకోవడం లేదంటూ జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద కార్యకర్తలతో ధర్నా చేయించిన రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో కనిపించడంలేదంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.

 హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది.  దీనిపై పురపాలక మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ ప్రతిపక్ష నేతలు ఆందోళనలు, విమర్శలు మానుకుని ప్రజలకు సాయం చేయాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి కనిపించడంలేదంటూ పోస్టర్లు వెలవడం హాట్ టాపిక్ గా మారింది. 

ఓ ఎంపీగా ఎప్పుడైనా నియోజకవర్గంలో పర్యటించారా అంటూ పోస్టర్లలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ పోస్టర్ల వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. అలాగైతే గజ్వేల్ ఎమ్మెల్యే మిస్ అవలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంవత్సరం ఏదైనా ఎన్ని వర్షాలు వచ్చినా గజ్వేల్ ఎమ్మెల్యే కనిపించడం లేదని కేసీఆర్‌ ఫోటోతో ఉన్న పోస్టర్లను ట్వీట్‌లో షేర్ చేశారు

పార్టీ అధ్యక్షుడిగా ఆయనపై ఉన్న బాధ్యతలతో పార్టీలో నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతున్నారు. అందులో భాగంగానే వేరే పార్టీ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, అధికార పార్టీతో పాటు బీజేపీని ఎదుర్కొనేందుకు యాత్రలు, భేటీలు, చర్చలు జరుపుతున్నారు. ఈ హడావుడిలో నియోజకవర్గం గురించి పట్టించుకొనే తీరక ఉండటం లేదని చెబుతున్నారు. 

ఇలాంటి పరస్థితుల్లో రేవంత్‌రెడ్డి కనబడుట లేదని ఆయనకు ఓట్లేసి గెలిపించిన మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. మల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌రెడ్డి గెలిచినప్పటికి గత ఏడాది కాలంగా పెద్దగా నియోజకవర్గ పరిధిలో పర్యటించడం, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పోస్టర్ల ద్వారా ప్రచారం జరుగుతోంది.  పోస్టర్లపై మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మిస్సింగ్ అంటూ రెండు ఫోటోలు పెట్టారు. ఒకటి 2020 హైదరాబాద్‌ రెయిన్స్ మరో ఫోటో కింద 2023 హైదరాబాద్ రెయిన్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. అంటే మూడేళ్ల క్రితం వర్షాల్లో పోయిన వ్యక్తి ఇప్పటికి కనిపించడం లేదని చెప్పకనే ప్రచారం చేస్తున్నారు. 

రేవంత్‌రెడ్డి మిస్సింగ్ వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. సిటీలోని ప్రతీ చోట బస్టాండ్, కరెంట్ పోల్స్, గోడలపై కూడా చివరకు ఈ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి.  అయితే మల్కాజ్‌గిరిలో ఏ అభివృద్ది కార్యక్రమం, అధికారిక కార్యక్రమం చేపట్టినా స్థానిక మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులకు పెద్దపీట వేయడంతో రేవంత్‌రెడ్డి లోక్‌సభ పరిధిలో ఎక్కువగా పర్యటనలు తగ్గించారనే విమర్శలున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles