రెచ్చిపోయిన షర్మిల, విజయమ్మ వీరంగం… పోలీసులకు చెంపదెబ్బలు

Wednesday, December 18, 2024

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పోలీసులపై రెచ్చిపోయారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచిన తన కుమార్తెను చూసేందుకు అనుమతిపలేదని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వీరంగం సృష్టించారు. తమను అడ్డుకున్న పోలీసులపై వారిద్దరూ ప్రతాపం చూపించారు. పోలీసులు చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది.

 తనను అడ్డుకుంటున్నారనే ఆక్రోశంతో షర్మిల పోలీసులపై మండిపడ్డారు. బయటకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయతించిన పోలీసులపై చేయి చేసుకున్నారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను బయటకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

ఈ క్రమంలో పోలీసులతో వైఎస్ షర్మిల తీవ్ర వాగ్వాదానికి దిగారు. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? అని ప్రశ్నించింది.  రోడ్డు మీద నడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఆ తర్వాత షర్మిల ముందుకు వెళ్లకుండా అడ్డుగా నిలబడిన మరో ఎస్సైను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. షర్మిలను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. షర్మిలను కారు ఎక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ కానిస్టేబుల్ పై కొట్టి చేయి చేసుకున్నారు.

షర్మిలను కారు ఎక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ కానిస్టేబుల్ చెంపపై కొట్టి, ఏమనుకుంటున్నావని హెచ్చరించారు. ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆందోళనకు దిగిన షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలతో తన గన్ మెన్ ను కూడా వెళ్లకుండా పోలీసులు ఆపేశారు.

మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంపై ఏప్రిల్ 26న హైకోర్టు అనుమతితో ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తామని షర్మిల చెప్పారు. పేపర్ లీకేజీ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా మళ్ళీ పరీక్షలు పెట్టడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. నిజమైన పేపర్ లీకేజీ కారకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆమె మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే పేపర్ లీకేజీపై సీబీఐతో విచారణ చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఇంకోవైపు, వైఎస్‌ షర్మిలపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని అడ్డుకోవడం, వారిపై చేయి చేసుకోవడంతో పోలీసుల ఫిర్యాదుపై షర్మిలపై కేసు నమోదు చేశారు. షర్మిలను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన షర్మిలతో భేటీ అయ్యేందుకు అనుమతి నిరాకరించారు.

జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ వద్ద షర్మిలను చూసేందుకు వచ్చిన విజయమ్మ సైతం పోలీసులపై చేయి చేసుకున్నారు. షర్మిలను చూసేందుకు అనుమతించకపోవడంతో వైఎస్ విజయమ్మ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమె పోలీసులపై చేయి చేసుకున్నారు. విజయమ్మను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించారు. వైఎస్ విజయమ్మను పోలీస్ స్టేషన్ నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అటు షర్మిల, విజయమ్మ పోలీసులపై చేయి చేసుకోవడంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై కడప రౌడీయిజం చేశారని ఆరోపించారు. అయితే, “నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..? పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నా మీద పడితే నేను భరించాలా..? నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..?’’ అని షర్మిల ప్రశ్నించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles