వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటె చవకబారు వాదనలతో తమను తాము భ్రష్టు పట్టించుకోవడం అనేది భవిష్యత్తులో కూడా జరగదేమో! మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఎప్పటికీ రానటువంటి చిత్రవిచిత్రమైన వాదనలను తయారుచేసి.. ఆయన కళ్లలో ఆనందం చూడడానికి వాటిని ప్రజల ముందుకు తెస్తున్నారు నీలిదళాలు!! ప్రజలు ఛీకొట్టే తరహాలో వారి విమర్శల పర్వం సాగుతుండడం ప్రత్యేకంగా గమనించాలి. విశాఖలో రుషికొండను బోడి కొట్టించేసి.. అక్కడ తన నివాసం, తన కూతుళ్ల నివాసాల కోసం మూడు అద్భుతమైన భవంతులు నిర్మించుకున్న స్వార్థపూరిత చక్రవర్తి జగన్ పోకడలకు, పొలాలను ఒక అద్భుతమైన రాజధాని కోసం రైతులు త్యాగంచేసి అప్పగించిన చోట అమరావతి రాజధానిని నిర్మించాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు సంకల్పానికి మధ్య పోలిక తెస్తూ.. వైసీపీ వందిమాగధులు తమ కురచ బుద్ధులు తామే చాటుకుటుంన్నారు.
ఏపీ కేబినెట్ భేటీలో విశాఖపట్నం రుషికొండ భవనాల గురించి కూడా చంద్రబాబునాయుడు మంత్రి వర్గ సహచరులతో చర్చించారు. జగన్ అప్పట్లో తన నివాసం కోసం అన్ని రకాల అనుమతులకు, నిబంధనలకు విరుద్ధంగా రుషికొండను బోడికొట్టించి ఆ భవంతులు కట్టించారు. నిర్మాణం తన నివాసం కోసం అయినప్పటికీ.. టూరిజం శాఖ నిధులతో వారి ఆధ్వర్యంలో వీవీఐపీల కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మిస్తున్నాం అంటూ అప్పట్లో కోర్టులను కూడా వంచించి నిర్మాణాలు చేపట్టిన సంగతి అందరికీ తెలుసు. అవి ఇప్పుడు ఎందుకూ పనికి రాకుండా తయారయ్యాయి. టూరిజం శాఖ కింద వాడుకోవడానికి అవి పనికి రావని, వృథా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మంత్రివర్గ సహచరులతో అన్నారు. వాటిని ఏ రకంగా వినియోగించుకోవచ్చునో.. మంత్రులు అక్కడ పర్యటించి తోచిన సలహాలు చెప్పాలని కూడా ఆయన కోరారు.
అయితే ఇప్పుడు నీలిదళాలు, జగన్ వందిమాగధులు కొత్త ప్రచారం చేస్తున్నారు. విశాఖలో రుషికొండ భవంతుల్ని మాత్రం వేస్టని అంటున్నారు. అదే సమయంలో అమరావతిలో వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు కడుతున్నారు.. అంటూ వితండ వాదన చేస్తున్నారు. ఇంతకంటె చవకబారు వాదన మరొకటి ఉంటుందా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు రుషికొండలో తన నివాసం కోసం 500 కోట్ల ప్రభుత్వ ధనం తగలేసి జగన్ కట్టించుకున్న ప్యాలెస్ లకు, అమరావతిలో రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి చేపడుతున్న రాజధాని నిర్మాణానికి ఏమైనా పోలిక ఉన్నదా అని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ అమరావతి ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేయదలచుకుంటే.. ఇప్పుడు అక్కడ అద్భుత నిర్మాణాలు ఆవిష్కృతం అవుతుండడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ప్రజల దృష్టిలో వైసీపీ నాయకుల విషపు బుద్ధులు మరింత పలుచన అయిపోకుండా, వారి పరువు పోకుండా ఉండాలంటే.. అమరావతి గురించి నెగటివ్ గా మాట్లాడడం తగ్గించుకోవాలని, అమరావతి ఏకైక రాజధాని అనే ప్రతిపాదనకు అనుకూలంగానే రాష్ట్రప్రజలు ఓట్లు వేసి కూటమి కి అధికారం కట్టబెట్టారని తెలుసుకోవాలని ప్రజలు అంటున్నారు.
రుషికొండతో అమరావతిని పోలుస్తున్న కురచబుద్ధులు!
Wednesday, April 9, 2025
