రాహుల్ భరోసాతో కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా రేవంత్!

Sunday, December 22, 2024

తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక విధంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు.  ఈ దిశలో ఆయన చేపట్టిన యాత్ర ఎన్నికల ముందు పార్టీని జనంలోకి తీసుకు వెళ్లేందుకు సహాయపడుతుంది. దానితో సీనియర్ నేతలు అంతా  సహాయనిరాకరణ కొనసాగిస్తున్నా పార్టీలో తిరుగులేని నేతగా రేవంత్ ఎదుగుతున్నారు. అందుకు రాహుల్ గాంధీ ఇస్తున్న భరోసా కారణమని చెప్పవచ్చు.

అయితే, జనాదరణ పెరుగుతూ ఉండడంతో మొన్నటి వరకు తెలంగాణాలో కాంగ్రెస్ శకం ముగిసినట్టే అంటూ పట్టించుకోకుండా వస్తున్న బిఆర్ఎస్, బిజెపి నేతలు ఇప్పుడు రేవంత్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. రేవంత్ యాత్రపై దాడులు కూడా మొదలయ్యాయి. అయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూకుడు పెంచుతున్నారు.

ఒక రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మరో రోజు సీనియర్ నేత వి హనుమంతరావు తప్ప సీనియర్లు ఎవ్వరు ఈ యాత్రలో కనిపించలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్ర జరుగుతున్నప్పుడు మాజీ పిసిసి నేత పొన్నాల లక్ష్యయ్య అటువైపే చూడలేదు. కనీసం రేవంతపై ప్రత్యర్ధులు మాటల దాడులు చేస్తున్నప్పుడు కూడా సీనియర్లు ఎవ్వరు మద్దతుగా రావడం లేదు.

అయినా, ధీమాగా రేవంత్ ముందుకు వెళ్లేందుకు రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసా కారణంగా కనిపిస్తోంది. రేవంత్ కు మద్దతుగా ఒక వంక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఢిల్లీ స్థాయిలో  బలమైన లాబీ యింగ్‌ చేస్తున్నారు. మరోవంక, వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత తెలంగాణాలో జనంలోకి వెళ్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ మాత్రమే అనే దృడాభిప్రాయంతో రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తున్నది.

వచ్చే ఎన్నికలలో సుమారు 80 శాతం సీట్లు రేవంత్ చెప్పేవారికే ఇస్తామని ఆయన భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు స్వయంగా రేవంత్ యాత్ర గురించి వాకబు చేస్తున్నారు. సమస్యలు ఏవైనా వస్తే పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తో టచ్ లో ఉండమని సూచించారని తెలిసింది.

రేవంత్ కు పార్టీలో తలెత్తే అంతర్గత సమస్యలను తాను చూసుకుంటానని చెబుతూ ఎన్నికల సమ యంలో ప్రచారానికి రావడంతో పాటు, అవసరం మేరకు ప్రియాంక కూడా వస్తారని చెప్పారు. దానితో రేవంత్ ఉత్సాహంగా సాగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు కూడా కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతోంది.

ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ సీనియర్లు సహితం తమ సొంత రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ నాయకత్వంకు ఎన్నికలయ్యే వరకు తిరుగులేదని స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles