రాహుల్ : చావుతప్పి కన్నుల్లోటుపోయినట్లు..

Friday, December 20, 2024

భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆరాధిస్తూ ఉండే రాహుల్ గాంధీకి ఇంకా గడ్డు రోజులు తొలగిపోలేదు. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఆయన  జైలు శిక్షణ అయితే తాత్కాలికంగా తప్పించుకున్నారు గాని, వచ్చే ఎన్నికలలో మళ్లీ ఎంపీ కావడానికి యోగ్యత సంపాదించుకుంటారో లేదో అర్థం కావడం లేదు. ఆయనకు సూరత్ సెషన్స్ కోర్టు విధించిన జైలు శిక్ష అమల్లోకి రాకపోయినప్పటికీ, ఇంకా అలాగే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే సమయంలో అదుపుతప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఎలాంటి విపరిణామాలు చుట్టుముడతాయో రాహుల్ ఇప్పుడు స్వానుభవంలో గమనిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిపేరు గురించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి అందరికీ తెలిసిందే. మోడీ ఇంటి పేరుతో ఉన్న మరో నాయకుడు కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేయడంతో సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నేరమయ రాజకీయాలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చిన కొత్త చట్టాల దరిమిలా, శిక్ష పడిన మరుక్షణం నుంచే ఆయన పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దయింది. ఢిల్లీలో ఎంపీగా అధికారిక నివాసాన్ని కూడా రాహుల్ గాంధీ అయిష్టంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. పైకోర్టు జైలు శిక్ష ఉత్తర్వులను హోల్డ్ చేయడంతో ఆయన జైలుకు వెళ్లవలసిన దుస్థితిని తప్పించుకున్నారు. అయితే అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే.

ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ఈ శిక్ష నుంచి విముక్తి పొందడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు. గుజరాత్ హైకోర్టుకు అప్పీలు చేసుకుంటే ఆయనకు ఊరట లభించలేదు. విధిగా కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వవలసిన అవసరం లేదని పేర్కొంటూనే.. ఆయనపై దేశవ్యాప్తంగా 10 కేసులు పెండింగ్లో ఉన్నాయని కూడా గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. జైలు శిక్ష రద్దు చేయడానికి లేదా కింది కోర్టు తీర్పు పై ఇస్తే ఇవ్వడానికి రాహుల్ తరఫున న్యాయవాదులు సహేతుకమైన కారణాలను చూపించలేకపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విపక్షాలు అన్నింటిని ఏకతాటి మీదికి సమీకరిస్తున్న రాహుల్ గాంధీ కి ఈ తీర్పు ఖచ్చితంగా ఎదురుదెబ్బ.

ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా ఆయనకు వేరే గత్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదే ప్రయత్నాల్లో ఉంది. సుప్రీంను ఆశ్రయించినంత మాత్రాన సానుకూల తీర్పు వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఈ గడ్డు పరిస్థితులను ఎలా అధిగమించి రాహుల్ నెగ్గుకొస్తారో చూడాలి. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా.. రాహుల్ కు ప్రస్తుతానికి జైలుశిక్ష నుంచి ఉపశమనం దక్కింది గానీ, ఎన్నికల్లో పాల్గొనడానికి ఆరేళ్ల అనర్హత నీలినీడలు అప్పుడే తొలగిపోయేలా లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles