తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటూ ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సహితం మొదటి నుండి ఆ పార్టీతో, ముఖ్యంగా గాంధీ కుటుంబంతో దూరంగా ఉంటూ వస్తున్నారు. దేశాన్ని 70 ఏళ్ళు పాలించిన
కాంగ్రెస్, బిజెపి దేశాన్ని అధ్వాన్నంగా మార్చివేశాయి అంటూ రెండు పార్టీలను కలిసి విమర్శలు గుప్పిస్తున్నారు.
2018 నుండి కాంగ్రెస్, బీజేపీ లేని మూడో కూటమి – ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలను దేశం ముందు ఉంచుతూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సహితం అవకాశం చిక్కినప్పుడల్లా కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా, మొన్నటి వరకు బిజెపికి మద్దతు ఇస్తూ వచ్చిన కేసీఆర్ ను ఆ పార్టీ ఏజెంట్ గా మాత్రమే చిత్రీకరిస్తున్నారు.
అయితే, మొదటిసారిగా సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేసిన తర్వాత రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్, ఆయన కుటుంభం సభ్యులు మాట్లాడటం ఆసక్తి కలిగిస్తున్నది.
ఇది ప్రధాని మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిందని దయ్యబట్టారు.
నేరస్థులు, దగాకోరులు కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని కేసీఆర్ హెచ్చరించారు. పార్టీల మధ్య వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్న కేసీఆర్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని ఆయన పిలుపిచ్చారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కోరారు.
ఆయనపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమేనని మంత్రి కేటీఆర్ సహితం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో రాహుల్ పై వేటు వేశారని మండిపడ్డారు. ఇది తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ తత్తవేత్త వాల్ టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్ కోట్స్ ను మంత్రి కేటీఆర్ జత చేశారు. రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ మద్దతు చేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి మచ్చ అంటూ ఎమ్యెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిసి వేటు వేశారని ఆమె తప్పుబట్టారు. ప్రజల దృష్టి మరల్చే మోదీ మిషన్‌లో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఆమె ఆరోపించారు. వైఫల్యాలు, అవినీతి మిత్రుల నుంచి దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బిజెపిపై పోరాటంలో భాగంగా కేసీఆర్ కాంగ్రెస్ తో చేతులు కలిపినా ఆశ్చర్యపోనవసరం లేదని ఈ సందర్భంగా పరిశీలకులు భావిస్తున్నారు.