రాయలసీమ ద్రోహి జగన్ .. చంద్రబాబు మండిపాటు

Wednesday, January 22, 2025

మొన్నటి వరకు తన హయాంలో జరిగిన అభివృద్ధి, ముఖ్యంగా సైబరాబాద్ అభివృద్ధి, ఐటి రంగంలో సాధించిన పురోగతిల గురించి నిత్యం ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన ధోరణి మార్చుకున్నారు.  రాష్త్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటిందని, ఎప్పుడో 20 ఏళ్ళ నాడు సైబరాబాద్ లో చేసిన అభివృద్ధి ప్రస్తావిస్తూ ఇప్పటి ఏపీ తరాన్ని మెప్పించే ప్రయత్నం విసుగు కలిగిస్తున్నట్లు గ్రహించినట్లున్నారు.

చివరకు టీడీపీ నేతలు సహితం బాబు ఎప్పుడు `సొంత డబ్బా’ కొట్టుకొంటున్నారని ఎద్దేవా చేస్తుండటం తెలిసిన్నట్లున్నది.  ఒకొక్క రోజు ఒకొక్క రంగంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలకు జరిగిన ద్రోహం, అన్యాయం గురించి సమగ్రమైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఉపాధ్యాయుని మాదిరిగా విశ్లేషణ జరుపుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ప్రజలకు విషయాలు తెలియచెప్పేందుకు అవసరమైన సమాచారం అందిస్తున్నారు.   

తాజాగా రాయలసీమకు వైసీపీ పాలనలో జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ వైఎస్ జగన్ ను `రాయలసీమ ద్రోహి’గా అభివర్ణించారు. ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి టీడీపీ ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది సీమ అభివృద్ధా? ద్రోహమా? ఈ ద్రోహానికి జగన్‌కు సిగ్గనిపించడం లేదా?’ అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ఏ ముఖ్యమంత్రి రాయలసీమకు ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు. 

రాయలసీమకు తాగునీరు ఇచ్చేందుకు తెలుగు గంగ ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిచ్చామని, ఫలితంగా రాయలసీమలో పంటలు బాగా పండుతున్నాయని గుర్తు చేశారు. నదుల అనుసంధానం కోసం తీవ్రంగా ప్రయత్నించామని చెబుతూ  నదుల అనుసంధానం చేస్తే ప్రతీ ఎకరాకు నీళ్లందుతాయని తెలిపారు. సాగునీటి రంగానికి 2014-19లో రూ.68,293కోట్లు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.22,165కోట్లు ఖర్చు చేసిందని చెబుతూ జగన్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నాశనం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.   నీటిపారుదల శాఖను జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. 

టీడీపీ ప్రభుత్వం బడ్జెట్‍లో 9.3 శాతం నిధులు సాగునీటికి రంగానికి కేటాయించగా, వైసీపీ సర్కార్ కేవలం 2.35% నిధులు మాత్రమే కేటాయించిందని తెలిపారు. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.43,572 కేటాయింపులు చేస్తే రూ.55,893 కోట్లు ఖర్చు చేశామని, నీరు-ప్రగతికి రూ.12,400 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.  నల్లమలలో నాగార్జున సాగర్ కుడికాలువ దగ్గర 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వగలిగితే వెలుగోడుకు కృష్ణా నీటిని తరలించవచ్చని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాకే పోతిరెడ్డి పాడు కెనాల్ విస్తరణ చేశామని తెలిపారు.  తెలుగు గంగకు టీడీపీ ప్రభుత్వం రూ.504కోట్లు ఖర్చు చేయగా,  వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.383కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. 

తెలుగు గంగ ఆయకట్టు పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. 2020లో పూర్తి చేస్తామన్నారని, కానీ ఇంత వరకు అతీగతి లేదని చంద్రబాబు మండిపడ్డారు. హంద్రీనీవా ఫేజ్-1, ఫేజ్-2 ఆయకట్టు 5,33,417 ఎకరాలకు గాను హంద్రీనీవాకు టీడీపీ ప్రభుత్వం రూ.4,182 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.515 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 2020 జూన్ కల్లా పూర్తి చేస్తామన్న జగన్ హామీ అమలు కాలేదని చెబుతూ గొల్లపల్లి ప్రాజెక్ట్ వల్లే కియా పరిశ్రమ వచ్చిందని గుర్తు చేశారు.

జగన్‍కు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్ లు పూర్తి చేయడంపై లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎస్సార్బీసీని 93శాతం టీడీపీ పూర్తి చేస్తే నాలుగేళ్లలో మిగిలిన 7శాతాన్ని జగన్ పూర్తి చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియా దెబ్బకు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్టికి 614రోజులైనా ఇంకా శిథిలాలే కనిపిస్తున్నాయని చెప్పారు.  రాయలసీమ ఎత్తిపోతల పేరుతో ప్రజలను వంచించాడని అంటూ సంఘమేశ్వరం నుంచి 3టీఎంసీలు తరలించే ప్రాజెక్ట్ ఏమైంది? అని ప్రశ్నించారు. 
జగన్ రాయలసీమ ద్రోహి కాకపోతే రాయలసీమ రక్షకుడా? అని చదన్రాబాబు ప్రశ్నించారు. నీరుంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని, హార్టికల్చర్ హబ్ గా ఎదుగుతుందని పేర్కొంటూ జగన్ పోవాలి.. సీమలో సిరులు పండాలని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles