రాయగిరి రైతులకు బేడీలు వేయడంపై ఆగ్రవేశాలు

Wednesday, December 18, 2024

`అప్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ జాతీయ స్థాయిలో మీడియాలో నిలువెత్తు ప్రకటనలతో ప్రచారం చేసుకొంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం తాను అధికారంలో ఉన్న తెలంగాణాలో మాత్రం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది. రాజధాని నగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న భువనగిరిలో నలుగురు రైతులను బేళ్లు వేసి మంగళవారం కోర్టుకు తీసుకు రావడంతో ప్రభుత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ఖమ్మంలో అదేవిధంగా చేసి తీవ్ర ఆగ్రవేశాలు ఎదుర్కొన్న తెలంగాణ పోలీసులు మరోసారి యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్ఆర్ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు.  ఇప్పటికే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రేమండ్ లో ఉంచారు. ఇంకా కరడుగట్టిన నేరస్థుల మాదిరిగా వారిని అవమానపరిచే విధంగా వ్యవహరించడం కలకలం రేపుతోంది.

న్యాయం కోసం పోరాడితే సంకెళ్లు వేస్తారా? అని రైతులు నిలదీస్తున్నారు. రైతులకు సంకెళ్లు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు తప్పుబడుతున్నాయి.  రైతులను 14 రోజుల నల్గొండ జిల్లా జైల్లో ఉంచారు. రిమాండ్ పూర్తి కావడంతో రైతులను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచారు.

రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ పేరుతో దళిత రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వ భూములు ఉన్నా రైతుల భూమిని గుంజుకుంటున్నారు.  ఆర్ఆర్ఆర్ కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఇప్పుడు రైతులకు బేడీలు వేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ రైతుల కోసమే అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.  రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. 

మే 30న ఆర్ఆర్ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్‌ ముందు రాయగిరి రైతులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నారు.  దీంతో ఆరుగురు రైతులపై పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

నలుగురిని అదే రోజు అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నెల నాలుగో తేదీ వరకు భువనగిరి జైలులో ఉన్న రైతులను నల్గొండ జైలుకు తరలించారు.  అయితే రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నలుగురికి బెయిల్‌ మంజూరు అయ్యింది.

ఇదే క్రమంలో 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్ పూర్తవ్వడంతో మరోసారి వారిని కోర్టుకు తీసుకు వచ్చారు పోలీసులు. ఇప్పటికే బెయిల్‌ మంజూరు అయినందున వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తారు. అనంతరం రైతులు బెయిల్‌పై బయటకు రానున్నారు. ఇప్పటికే బెయిల్ పొందిన రైతులకు బేళ్ళు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles