ఎవ్వరి నుండి ఎటువంటి ఫిర్యాదు లేకుండానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు జరిపి కేసు నమోదు చేయడం, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ చిట్ ఫండ్స్ చైర్మన్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజలలతో పాటు పలువురిపై అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం గమనిస్తే కక్షసాధింపు చర్యలలో భాగంగా జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు.
మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, విచారణకు సంస్థ సహకరించడం లేదని పేర్కొంటూ, ఇదే కొనసాగితే దానైని మూసివేస్తామని సిఐడి విభాగాధిపతి సంజయ్ ప్రకటించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో చోటు చేసుకున్న లొసుగులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనపై స్పష్టమైన ఆధారాలు లభించాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు.
రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నుంచి సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్భంగా వారు చెప్పారు. అంటే ప్రభుత్వ అధికారుల ఫిర్యాదుల ఆధారంగా ఇవ్వన్నీ చేస్తున్నారు. చిట్ కట్టినవారెవ్వరు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అండదండలు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ కుటుంభంకు చెందిన సాక్షి పత్రిక మొదటిస్థానంలోకి రాకపోవడంతో ఈనాడు పత్రికను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ కేసు వ్యవహారం జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
ఏదేమైనా రామోజీరావును అరెస్ట్ చేసి, మార్గదర్శి చిట్స్ ను ఏపీ వరకు మూసివేయడం ద్వారా ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని ఎత్తుగడగా కనిపిస్తున్నది. యావజీవ కారాగార శిక్ష విధించే సెక్షన్ 477, పదేళ్ల జైలు శిక్ష విధించే 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనిస్తే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం అవుతుంది.
అయితే, తెలంగాణ హైకోర్టులో ఈ కేసుల్లో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజలకు కొంత ఊరట లభించింది. వారం రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
గుంటూరులో అరెస్టు చేసిన వారిని న్యాయమూర్తి, రిమాండ్ కు పంపేందుకు నిరాకరించగా, విజయవాడ, విశాఖపట్నంలలో మాత్రం రిమాండ్ విధించడం విస్మయం కలిగిస్తుంది. ఒకే సెక్షన్ కింద అరెస్ట్ అయిన వారిని ఒకచోట రిమాండ్ కు తిరస్కరించగా, మరొక చోట రిమాండ్ విధించడం పరిశీలిస్తే న్యాయస్థానంను సహితం ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఈ కేసు పై పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు హౌస్ మోషన్ మూవ్ చేయగా హైకోర్టు మంజూరు చేయలేదు. సాధారణంగా హౌస్ మోషన్ అనేది మంజూరీ చేయకపోవడం అనేది ఉండదు. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రామోజీరావు పై ఎవరు ఫిర్యాదు చేయకుండానే సుమోటోగా కేసులు నమోదు చేయడం దారుణం అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
గతంలో ఇదే తరహాలో తనపై కూడా రాజ ద్రోహం కేసును నమోదు చేశారని గుర్తు చేశారు. అయితే, తనను తన ఊరు వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల తాను హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా మంజూరి లభించిందని చెప్పారు.
ఎన్నికల సంవత్సరంలో తమ ప్రభుత్వ లొసుగులను ఈనాడు దినపత్రిక బయటపెడుతుంటే ప్రజలపై ప్రభావం చూపిస్తుందని భయంతో కావచ్చు. ఉద్దేశ పూర్వకంగా కేసులు నమోదు చేశారనే విమర్శలు చెలరేగుతున్నాయి.
లేకపోతే, సాక్షి దినపత్రికకు ఈనాడు పోటీగా ఉందనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు. ప్రభుత్వం నుండి సాక్షి పత్రికల కొనుగోలు, ఉదారంగా ప్రకటనలు జారీచేస్తున్నప్పటికీ, ఈనాడు దినపత్రికలో మూడవ వంతు సర్కులేషన్ కూడా సాధించలేకపోతున్నామనే అక్కసుతోనైనా కేసును నమోదు చేసి ఉంటారని రామకృష్ణంరాజు ఆరోపించారు.
సాక్షి దినపత్రిక ఐదు లక్షల పేపర్లను అన్యాయంగా విక్రయించుకుంటుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేసినందుకు కక్షతోనే రామోజీరావుపై కేసు నమోదు చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో తాను జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినప్పుడు, తనని అన్యాయంగా అరెస్టు చేశారని గుర్తు చేశారు.