`మాస్ లీడర్’ గా ఏమాత్రం పేరు లేకపోయినప్పటికీ మొదట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా, ఆ తర్వాత ఢిల్లీలో లాబీ ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ లోనే అందరికి ఆశ్చర్యం కలిగించే విధంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తిరిగి బీజేపీలో సహితం `ఢిల్లీ లాబీ’తోనే ప్రాధాన్యత పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో చేరిన తర్వాత కూడా ఢిల్లీలోనే ఉంది అగ్రనాయకులతో భేటీ అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా విశేషమైన పట్టుగల రెడ్డి సామాజిక వర్గం నుండి బీజేపీలో ఇపుడు బలమైన నాయకుడు ఎవ్వరు లేరు. గతంలో పార్టీ తొలి అధ్యక్షుడు డి సూర్యప్రకాశ్ రెడ్డి, దక్షిణాదిలోనే పార్టీకి మొదటి మేయర్, ఆ తర్వాత ఎమ్యెల్యే అయినా ఎన్ ఎస్ ఎన్ రెడ్డి, రాష్త్ర అధ్యక్షులుగా పనిచేసిన రామచంద్రారెడ్డి, ఎన్ ఇంద్రసేనారెడ్డి వంటి బలమైన నాయకులు ఉండేవారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు సాధారణ ప్రజానీకంతో చెప్పుకోదగిన గుర్తింపు లేదు. డీకే అరుణ వంటి వారికి కీలక పదవులు ఇచ్చినా వారి ప్రభావం వారి జిల్లాను దాటి లేదు. పైగా, బిజెపికి కీలకమైన కర్ణాటకలో సహితం, ముఖ్యంగా బెంగళూరులో తెలుగు వారితో పాటు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా గత ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది.
అందుకనే కిరణ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చలు జరిపిన హోమ్ మంత్రి అమిత్ షా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి జెపి నడ్డా ఇంట్లో జరిగిన కీలక సమావేశాలు కూడా ఉంచారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పుతున్నట్లు వార్తలు వచ్చాయి.
కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ లో కీలక నాయకుడు. ఆయన అకాల మరణం పొందడంతో చిన్నవయసులోనే ఎమ్యెల్యే అయ్యారు. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు తన నియోజకవర్గంలో తిరగలేదు. హైదరాబాద్ లో పెరిగిన ఆయన రంజీ కెప్టెన్ గా తన జట్టులో ఉన్న అజారుద్దీన్ అప్పుడు యుపి నుండి ఎంపీగా ఉండటం, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడు కావడంతో క్రమంగా రాబర్ట్ వాద్రాకు దగ్గరయ్యారు.
రాబర్ట్ వాద్రా ద్వారా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సహితం దగ్గరై ముఖ్యమంత్రి పదవి పొందగలిగారు. తనకు మొదటగా కేంద్రంలో మంత్రి పదవి అమరనాథరెడ్డి ద్వారానే రావడంతో కృతజ్ఞతతో అప్పటి కేంద్ర హోమ్ మంత్రిగా చిదంబరం సహితం అవసరమైన `నిఘా సమాచారం’ సమకూర్చి కిరణ్ సీఎం కావడంలో కీలక పాత్ర వహించారు.
కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై బిజెపి ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. అయితే సొంతంగా పార్టీ పెట్టుకొని, తన సీట్ కూడా గెలిపించుకోలేని ఆయన ద్వారా బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో గాని, కర్ణాటకలో గానే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో సందేహాస్పదమే. పైగా, రెడ్డి సామాజికవర్గం ఏపీలో వైఎస్ జగన్ కు, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నది.