మాటతప్పను మడమ తిప్పను అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు. నాలుగేళ్ల పాలనలో మాటతప్పిన వ్యవహారాలు బోలెడన్ని ఏకరవు పెట్టొచ్చు గానీ.. తాజాగా ఉద్యోగుల విషయంలో వ్యవహరించిన తీరు, మాట తప్పడం అనేది ప్రభుత్వానికి సమస్యాత్మకంగా మారుతోంది. ప్రజలనున కూడా ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. చర్చలకు పిలిచి, వారికి హామీలు ఇవ్వడంలో మాట చెప్పినది ఒకటి- అవే హామీలను రాతపూర్వకంగా అందజేయడంలో పేర్కొన్నది ఒకటిగా ఉండడంతో ఉద్యోగులు ఆగ్రహించారు. ఉద్యమపంథాలో మార్పు లేకుండా పోరాటం కొనసాగిస్తున్నారు.
అందరు మంత్రులు, ఉన్నతాధికారులు, సలహాదారులు కూర్చుని గంటల తరబడి చర్చించి.. తాము అనేక మెట్లు దిగివచ్చాం అని ప్రకటించుకుని.. వరాలు ప్రకటించాం అని చాటుకుని.. ఎన్ని చేసినప్పటికీ కూడా వారు ఉద్యోగుల నమ్మకాన్ని మాత్రం పొందలేకపోయారు. చర్చల సందర్భంగా తాము ప్రధానంగా డిమాండ్ చేసిన ప్రధానాంశాల ప్రస్తావన ఏమీ లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.
తమాషా ఏంటంటే.. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, అంటే వారి డబ్బే 3000 కోట్లు వారికి ఇవ్వడాన్ని ప్రభుత్వం అతిపెద్ద వరంగా చాటుకుంటోంది. ఈఎల్ లు కూడా వారి సొమ్మే. ఆ రూపేణా 2000 కోట్లు సెప్టెంబరులోగా ఇస్తాం అని ప్రకటించింది. ఇవి తప్ప మరో డిమాండ్ గురించి మాట్లాడడం లేదనేది ఉద్యోగుల గొడవ. నిజానికి ఈ రెండు డిమాండ్ల రూపేణా ప్రభుత్వం వారికి ఒరగబెడుతున్నది ఏమీ లేదు. ఆ విషయం ఉభయులకూ తెలుసు. అందుకే ఇతర డిమాండ్ల ప్రస్తావన రాతపూర్వక హామీలో లేకపోవడంతో ఉద్యోగుల సమ్మె యథాతథంగా, కొన్ని మార్పులతో సాగుతోంది.
ఈ ఎపిసోడ్ గమనిస్తే ఒక సంగతి అర్థమవుతుంది. ఉద్యోగుల నమ్మకాన్ని పొందడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వంలో ‘కీలకం’ అనదగిన ప్రతి ఒక్కరూ వారితో చర్చల్లో ఉన్నారు. కానీ.. వారిని తమ మాటలతో నమ్మించలేకపోయారు. మాయమాటలతో ఎన్నాళ్లు నమ్మించగలరు? అనేది కూడా అర్థమైంది. ఉద్యోగుల సమ్మె ప్రభావం అనేది కేవలం ప్రజల జీవితాలను ఇబ్బందులకు గురి చేయడం తద్వారా ప్రభుత్వ వైఫల్యాల మీద వారి దృష్టిపడేలా చేయడం మాత్రమే కాదు.. ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపుతుంది. నిజానికి అందుకే ప్రభుత్వం కూడా హడావుడిగా వారితో చర్చలకు దిగివచ్చి.. మొక్కుబడి వరాలిచ్చింది. ఆ వరాలకు వారు బుట్టలో పడలేదు. పోరుబాటు కొనసాగుతోంది. ఉద్యోగుల ఉద్యమం ప్రజల జీవితాలకు ఇబ్బంది కలిగిస్తే.. ప్రభుత్వ వైఫల్యమనే భావించాలి.
రాతలో మాట తప్పారు.. నమ్మకం కోల్పోయారు!
Sunday, January 19, 2025