ఇదివరకు కూడా ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలాంటి ప్రయత్నమే చేశారు. రాజ్యాంగ సంక్షోభం రావడానికి ఆయన నిర్ణయం కారణమైంది. అంతలోనే సర్దుకుంది. కానీ ఈసారి మళ్లీ అలాంటి ప్రయత్నమే ఇంకాస్త ఘాటుగా చేస్తున్నారు. ఈసారి ఈ రాజ్యాంగ సంక్షోభంపై దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించేందుకు ఆయన స్కెచ్ వేశారు. రాష్ట్ర గవర్నరు తమిళిసైతో ఇంచుమించు వ్యక్తిగత కక్షల తరహాలో వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
గవర్నరు తమిళిసైకి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మధ్య పచ్చగడ్డివ వేస్తే భగ్గుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నరు ఆమోదించకుండా ఆపివేయడం, లేదా రకరకాల వివరణలు అడుగుతూ కాలయాపన చేయడం అనేది చాలా అలవాటుగా జరుగుతోంది. ఈ విషయాలపై గతంలో కేసీఆర్ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నరును తామెలా ఆదేశించగలం అంటూ కోర్టు తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. అదే సమయంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రతిష్టంభన కూడా ఏర్పడింది. అసలు బడ్జెట్ సమావేశాల్లో గవర్నరు ప్రసంగమే లేకుండా చేయాలని కేసీఆర్ సర్కారు తలపోసింది. ఇలాంటి ప్రతిష్టంభన మధ్య హైకోర్టు చొరవతో రాజీ కుదిర్చడంతో.. గవర్నరు సంతకాలు పెట్టేలా, అసెంబ్లీలో ఆమె ప్రసంగం ఉండేలా ఒప్పందం కుదిరింది.
ఇది జరిగి అంతా నెలన్నర కూడా కాలేదు. ఈలోగా సంబంధాలు మళ్లీ బెడిసి కొట్టినట్టున్నాయి. కొన్ని రోజుల కిందట.. గవర్నరు తమిళిసై, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ కంటె రాజభవన్ దగ్గర అంటూ.. చీఫ్ సెక్రటరీ అయ్యాక మర్యాదపూర్వకంగా తనను ఒక్కసారి కూడా వచ్చి కలవలేదని ఆమె అన్నారు.
ఇప్పుడు కేసీఆర్ మరోమారు గవర్నరుతో సున్నం పెట్టుకోదలచుకున్నారు. ఆమె వద్ద బిల్లులు పెండింగులో ఉండిపోతున్నాయని, వాటిని ఆమోదించడం లేదని పేర్కొంటూ ఏకంగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేయడానికి కేబినెట్ నిర్ణయించింది. ఇదే జరిగితే రాజ్యాంగ సంక్షోభమే లెక్క. భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంక్లిష్ట స్తితి వచ్చి ఉండకపోవచ్చు. గవర్నరు , రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన వారు కాకపోయినా.. వారు బిల్లులను ఆపడం అనేది అత్యంత అరుదైన సంగతి. అదే సమయంలో ఏకంగా గవర్నరు మీద కోర్టుకు వెళ్లడం కూడా అనూహ్యం. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ సుప్రీంను ఆశ్రయించడం ద్వారా ఏం సాధిస్తారో చూడాలి.
రాజ్యాంగసంక్షోభానికి తెరలేపుతున్న కేసీఆర్!
Sunday, January 19, 2025