వైసీపీ ఎన్డీయేలో భాగస్వామిగా కాదు. అధికారికంగా బిజెపికి మిత్రపక్షం కూడా కాదు. కానీ పార్లమెంట్ లో అన్ని సందర్భాలలో ఆ పార్టీకి బాసటగా నిలబడుతుంది. అదే విధంగా సిబిఐ కేసుల విషయంలో గాని, ఆర్ధిక సంబంధ సంబంధాలలో గాని వైఎస్ జగన్ ప్రభుత్వంకు కేంద్రం అండగా ఉంటూ వస్తున్నది. రాజ్యసభలో బిల్లులు ఆమోదం తెలపడానికి కావాల్సిన మెజారిటీ లేని బిజెపికి గత నాలుగు సంవత్సరాలుగా పలు వివాదాస్పద బిల్లులను ఆమోదింపచేయడంలో వైసిపి బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్నది.
ఇప్పుడు పెను వివాదంకు దారితీస్తున్న ఢిల్లీ పాలనా యంత్రాంగంపై అధికారం విషయంలో కూడా బిజెపిని గట్టెక్కించేందుకు వైసిపి సిద్ధపడుతుంది. ఒక వంక ప్రతిపక్షాలు `ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడటం, మరోవంక మణిపూర్ అల్లర్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడటంతో ఇరకాట పరిస్థితిలో ఉన్న బిజెపికి వైసిపి కీలకమైన మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నది.
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును ఎదుర్కోవడం కోసమే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్దపడుతున్నారు. ఏదేమైనా ఈ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది. రాజ్యసభలో తగు బలం లేకపోయినా వైసీపీ, బిజెడిల మద్దతుతో ఈ బిల్లును ఆమోదింప చేసుకోగలమనే భరోసా బీజేపీలో వ్యక్తం అవుతుంది. ఢిల్లీకి రాష్త్ర హోదా ఉన్నప్పటికీ పూర్తి అధికారాలు లేవు. చివరకు గతంలో యుపిఎ ప్రభుత్వంలో అధికారుల నియామకాలపై ఉన్న అధికారాలను సైతం మోదీ ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుంది.
ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించి, కేజ్రీవాల్ ప్రభుత్వం సానుకూల ఉత్తరువులు పొందింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పును నిర్వీర్యం చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన బిల్ పార్లమెంట్ ముందుకు వస్తున్నది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తూ ఉండడంతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతో జత కట్టడంతో బిజెపికి కంటక ప్రాయంగా మారింది.
రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంతో సానుకూల సంబంధాలు అవసరం అనే వంకతో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక పర్యాయాలు ఓటింగ్ సమయంలో బిజెపికి అండగా అంటూ వస్తున్నది. ఈ ఆర్డినెన్స్ తో పాటు మణిపూర్ పై లోక్ సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలోనూ వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేయనున్నట్టు ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించారు.
వైసీపీకి రాజ్యసభలో 9 మంది సభ్యులున్నారు. లోక్ సభలో రఘురామ క్రిష్ణంరాజును కలపకుండా చూస్తే 22 మంది ఎంపీలున్నారు. లోక్ సభలో బిజెపికి సొంతంగా మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో మొత్తం ఎన్డీయే పక్షాలను కలుపుకున్న పూర్తి మెజారిటీ లేదు. అందుకనే వైసీపీ మద్దతు కీలకం కానుంది. వైసీపీ మద్దతు కోసమే టిడిపితో పొత్తు విషయంలో బిజెపి వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. ఏదైనా బిల్లు గట్టెక్కాలంటే 120 మంది మద్దతు అవసరం. బీజేపీ 105 మంది సభ్యులే ఉన్నారు. ఐదుగురు నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు తమకే మద్దతిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. వీరిని కలుపుకొని 112 మంది అవుతారు. మెజారిటీకి 8 తక్కువ. ఇక్కడే వైసీపీ మద్దతు కీలకమైంది. కాగా, ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా 105 మంది ప్రతిపక్ష సభ్యులు ఓటేసే అవకాశం ఉంది.