రాజాసింగ్ ఎమ్యెల్యే సీట్ కు కిషన్ రెడ్డి చెక్!

Monday, September 16, 2024

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎవ్వరూ అనుకోకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆ పార్టీ నేతల జాతకాలు తారుమారవుతున్నాయి. ముఖ్యంగా పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్న గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ నేతలలో ఎవ్వరికీ పార్టీతో సంబంధం లేకుండా తమ తమ నియోజకవర్గాలలో వ్యక్తిగతంగా చెప్పుకోదగిన బలం లేదు. సొంతంగా పోటీచేస్తే ఎవ్వరూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేరు. అందుకు కేవలం రాజాసింగ్ మాత్రమే మినహాయింపు. అందుకనే రాజాసింగ్ ను తెలంగాణ బీజేపీ నాయకులే కాకుండా, ఆర్ఎస్ఎస్ నేతలు సహితం `ప్రమాదకారి’గా చూస్తున్నారు.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ నుండి రాష్త్ర, జాతీయ రాజకీయాలకు వెళ్లిన కిషన్ రెడ్డి, డా లక్ష్మణ్ వంటివారు మొదటి నుండి రాజాసింగ్ ఉనికి సహింపలేక పోతున్నారు. అతని ముందు జనంలో తాము పలచబడిపోతున్నామని నూన్యతాభావం వాటిని వెంటాడుతున్నది. అందుకనే 2018 ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్యెల్యే అయిన రాజాసింగ్ కు తిరిగి సీట్ ఇవ్వరాదని బిజెపి నాయకులతో పాటు, ఆర్ఎస్ఎస్ నేతలు సహితం నిర్ణయించారు.

అయితే అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సొంతంగా జోక్యం చేసుకొని రాజాసింగ్ కు సీటు ఇచ్చారు. అయితే జాతీయ నాయకులు ఎవ్వరూ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయనీయకుండా అడ్డుకున్నారు. చివరకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ పని చేయవద్దని కూడా అనధికార ఆదేశాలు జారీచేశారు. 

ఆ ఎన్నికలలో కిషన్ రెడ్డి, లక్షణ్ తో పాటు తెలంగాణాలో బీజేపీ అభ్యర్థులు అందరూ ఓటమి చెందారు. 100 మందికి పైగా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. కానీ రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. కిషన్ రెడ్డి గతంలో రాష్త్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో చాలాకాలం  వారిద్దరి మధ్య పలకరింపులు కూడా లేవు.

ఇంతలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో, గ్రేటర్ హైదరాబాద్ లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కాకుండా తన సొంత వర్గం ఏర్పర్చుకొనేందుకు రాజాసింగ్ ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇంతలో ఓ వివాదంలో చిక్కుకోవడాన్ని ఆసరాగా తీసుకొని, రాష్త్ర అధ్యక్షుడికి సమాచారం కూడా లేకుండా రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసేటట్లు చేశారు.

సస్పెన్షన్ జరిగి సంవత్సరం దాటినా ఇప్పటివరకు కేంద్ర నాయకత్వం ఏమీ తేల్చలేదు. సస్పెన్షన్ ను ఉపసంహరించామని స్వయంగా బండి సంజయ్ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అందుకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కారణంగా పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇంతలో కిషన్ రెడ్డి రాష్త్ర అధ్యక్షుడు కావడంతో రాజాసింగ్ తిరిగి బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నుండి పోటీచేసే అవకాశాలు కనిపించడం లేదు.

హైదరాబాద్ నగరం నుండి పంపేయడం కోసం లోక్ సభ ఎన్నికల్లో  జహీరాబాద్ నుండి రాజాసింగ్ ను పోటీ చేయమని తాజాగా ప్రతిపాదిస్తున్నారు. అక్కడి నుండి రాజాసింగ్ గెలవడం సంగతి ఏమిటో గాని ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతున్న దృష్ట్యా ఆ పేరుతో ఎమ్యెల్యేగా ఎన్నిక కాకుండా అడ్డుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఒక వంక ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న పార్టీ ఎంపీలు అందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అటువంటిది ఉన్న ఎమ్యెల్యేను లోక్ సభ ఎన్నిక పేరుతో అసెంబ్లీకి పోటీచేయకుండా అడ్డుకోవడం కుట్రపూరితమే అని స్పష్టం అవుతుంది.

రాజాసింగ్ పై ఒక వంక సస్పెన్షన్ కొనసాగుతుండగా మరోవంక, మాజీ మంత్రి  ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ను అనధికారికంగా కాబోయే అభివృద్ధి అనే సంకేతం ఇస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన విక్రమ్ నియోజకవర్గంలో తనపని తాను చేసుకుంటూ  తానే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు చెప్పుకొంటున్నారు.  కిషన్ రెడ్డి వంటి నేతల అండదండలతో లేకుండా ఆ విధంగా చెప్పుకునే సాహసం బీజేపీలో మరెవ్వరు చేయలేక పోవచ్చు.  విక్రమ్ గౌడ్ తండ్రి ముకేశ్ గౌడ్ ను వరుసగా రెండుసార్లు రాజాసింగ్ ఎన్నికల్లో ఓడించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం రాజాసింగ్ ఆర్ధిక మంత్రి టి హరీష్ రావును కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బిఆర్ఎస్ లో చేరతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తన నియోజకవర్గంలోని హాస్పిటల్ కోసమే కలిసినట్టు రాజాసింగ్ చెబుతున్నారు. 

ఇప్పటికే టిడిపి తెలంగాణ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ తమ పార్టీలో చేరమని రాజాసింగ్ ను బహిరంగంగా ఆహ్వానించారు. మొదటగా టిడిపి అభ్యర్థిగా కార్పొరేటర్ గా రాజాసింగ్ గెలుపొందడం గమనార్హం.  అయితే, బీజేపీ సీటు ఇస్తే పోటీ చేస్తానని, లేకపోతే పోటీ చేయనని రాజాసింగ్ పైకి చెబుతున్నా  గోషామహల్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా దూసుకు పోతారని సర్వత్రా భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles