అధికార వికేంద్రీకరణ అంటే అర్థం ఏమిటి? జిల్లాలను విభజించి.. ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడానికి, మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఒకటే సిద్ధాంతం వర్తిస్తుందా? రెండింటికీ ఒకే సిద్ధాంతం పనిచేస్తుందా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఈ రెండు వ్యవహారాలను ఒకే గాటన కట్టేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనకు తలాతోకా లేదని ప్రజలు అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని సాహసాన్ని తమ ప్రభుత్వం చేస్తున్నదని ప్రకటించారు. రాజధానుల్ని మూడు ప్రాంతాల హక్కుగాభావించి.. రాష్ట్రప్రభుత్వ బాధ్యతగా దానిని పూర్తిచేయబోతున్నాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను విభజించి వికేంద్రీకరణ లక్ష్యంతో అదనంగా 13 జిల్లాలు ఏర్పాటుచేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు.
అయితే ఇక్కడే ప్రజలకు అనుమానం కలుగుతోంది. జిల్లాలను రెండు ముక్కలు చేయడానికి, రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటుచేయడానికి పోలిక చెప్పడమే ప్రజలను మోసం చేయడం అని వారు భావిస్తున్నారు. ఎందుకంటే.. 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశారు. అది నిజంగానే వింకేంద్రీకరణ అనిపించుకుంటుంది. జిల్లా రాజధానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రజలకు దీనివలన సౌకర్యం ఏర్పడుతుంది. ఆ పనిచేశారే తప్ప.. అదే పాత జిల్లాలో కలెక్టరు కార్యాలయాన్ని ఒక ఊరిలో, ఎస్పీ కార్యాయలం, జిల్లా కోర్టు వేర్వేరు ఊర్లలో ఏర్పాటు చేయలేదు కదా.. అనేది ప్రజల ప్రశ్న. ఫరెగ్జాంపుల్ గుంటూరు జిల్లాను గుంటూరు, పల్నాడు .. ఇలా జిల్లాలుగా విభజించారే తప్ప.. గుంటూరులో కలెక్టరాఫీసు, నరసరావుపేటలో ఎస్పీ ఆఫీసు, బాపట్లలో జిల్లా కోర్టు, తెనాలిలో ఇంకొన్ని జిల్లా కార్యాలయాలు ఏర్పాటుచేసి ఉంటే ఎంత కంపరంగా ఉండేది.. ఇప్పుడు రాష్ట్రానికి మూడు రాజధానుల కాన్సెప్టు కూడా అలాంటిదే అని ప్రజలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి గురించి, సమాన అవకాశాల గురించి అంతగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. మూడు రాజధానుల బదులుగా.. రాష్ట్రాన్నే మూడు ముక్కలుగా విభజిస్తే అది ఇంకా ఎంతో బాగుంటుందని కూడా అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు తోచిన మాటలతో మూడు రాజధానుల వాదనను సమర్థించుకుంటూ ప్రజల్ని బుట్టలో పెట్టగలనని అనుకుంటున్నారు. ప్రజలను మాయ చేయవచ్చునని భావిస్తున్నారు. ఒక చోట ఎగ్జిక్యూటివ్, మరోచోట అసెంబ్లీ, ఇంకో చోట హైకోర్టు ఉంటే.. అది అసలు అధికార వికేంద్రీకరణ ఎలా అవుతుంది? అనే ప్రశ్న ఎదురవుతోంది. నిజానికి హైకోర్టు తీర్పు తర్వాత.. మూడు రాజధానులు అనేది అసాధ్యం అని తేలిపోయినప్పటికీ.. జగన్ ఇంకా దాని గురించే ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని వంచిస్తున్నారనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.