రాజధాని మోసంలో ముసుగు తొలగుతోంది!

Monday, December 23, 2024

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనే మాయమాటలతో చాలా కాలంగా ప్రభుత్వం రోజులు నెడుతూ వస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం మాత్రమే తమ లక్ష్యం అని.. అందుకే మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకువస్తోంటే విపక్షాలు సైంధవుల్లాగా అడ్డుకుంటున్నాయని ఆక్రోశం వెలిబుచ్చుతోంది. ‘ఒక చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఏమిటయ్యా’ అని అడిగే వారికి దక్షిణాఫ్రికా వంటి అర్థం పర్థం లేని ఉదాహరణలు చెబుతోంది. ‘అధికార వికేంద్రీకరణ’ అనే కొత్త ముసుగును కూడా చూపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మాటల గారడీ చేస్తున్నప్పటికీ, బుకాయించే యత్నాలను కొనసాగిస్తున్నప్పటికీ.. మూడు రాజధానులు అనేది ఒక అబద్ధం అని తేలిపోతోంది.  రాజధాని త్వరలోనే విశాఖకు తరలుతుందని ముఖ్యమంత్రి నర్మగర్భంగా చేసిన ప్రకటన మాత్రమే కాదు.. విశాఖ ఒక్కటే రాజధాని అని ఆ పార్టీ మంత్రులందరూ వరుస ప్రకటనలతో ముసుగు తొలగిస్తున్నారు.

అయితే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా విశాఖ నగరాన్ని ప్రమోట్ చేయడం అనేది తమ కర్తవ్యం అని మంత్రులు భావించారేమో తెలియదు. దీనితో ముడిపెట్టి, అభివృద్ధి పేరుతో ఇన్నాళ్లు చెప్పిన మాయ మాటల ముసుగులు  తొలగిస్తున్నారు. విశాఖ ఒక్కటే రాజధాని అని చాటి చెప్పడానికి  వారు ఉవ్విళ్లూరుతున్నారు.

విశాఖలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరుగుతోంది. అయితే, ఈ సదస్సును విశాఖ నగరానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారా? ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఏర్పాటుచేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ఈ సమ్మిట్ కు ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి మంత్రి కూడా.. ముందుగా విశాఖ నగరాన్నే ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అనేది పెట్టుబడులకు స్వర్గధామం వంటిది, వనరుల పరంగా పుష్కలంగా ఉంటూ అనుకూలమైన రాష్ట్రం అనే ప్రమోషన్ పెద్దగా కనిపించడం లేదు. విశాఖలోనే రాజధాని ఉంటుంది.. విశాఖ అభివృద్ధి చెందుతుంది.. కాబట్టి మీరంతా వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అడుగుతున్నారు. 

తాజాగా ఇందుకోసం బెంగుళూరులో సదస్సు నిర్వహించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఎలాంటి శషబిషలు లేకుండా.. విశాఖ ఒక్కటే రాజధాని అని చెప్పేశారు. మూడురాజధానులు అనే పదమే లేదని కూడా అన్నారు. ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వం బెలగావిలో ఏడాదికి ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తరహాలోనే.. ఏపీ కూడా ఏడాదికి ఒక మారు గుంటూరులో నిర్వహిస్తుందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని, న్యాయరాజధాని అనే పదం కరెక్టు కాదని అన్నారు. అది కూడా కర్నాటక ధర్వాడ్ తరహాలో ఉంటుందన్నారు. 

ఇన్నాళ్లూ మూడు రాజధానులు అనే పదాలతో ఊదరగొట్టిన జగన్ సర్కారు ఇప్పుడు ముసుగు తొలగించి.. అసలురంగు బయటపెడుతోందని… మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనేది పెద్ద మాయ అని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles