బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేవరకు సొంత ఊరిలో అటుంచి, ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా ఓట్ కూడా లేని, ఆయనెవరో ఇక్కడికెవ్వరికి తెలియని జీవీఎల్ నరసింహారావు ఎన్నికల సర్వేలతో ఢిల్లీలో రాజకీయంగా మంచి పలుకుబడి సంపాదించారు. కొంతకాలం రాహుల్ గాంధీ వద్ద చేశారు. ఆ తర్వాత బీజేపీ పెద్దల వద్ద చేరి, నరేంద్ర మోదీ ప్రధాని కాగానే నేరుగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. యూపీ నుండి రాజ్యసభకు కూడా వెళ్లారు.
అయితే, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుండి ఆయనతో పెద్దగా ఉపయోగం లేదనుకున్నారో ఏమో, పార్టీ అధికార పదవిని తొలగించారు. ఇప్పుడు బీజేపీలో అధికారికంగా ఎటువంటి పదవి లేదు. దానితో ఢిల్లీలో ఇక పనేముంది ఏపీలో తిరుగుతున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుండి వైసిపి నాయకత్వంపై దగ్గరగా ఉంటూ, బీజేపీలో చంద్రబాబు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు.
సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించారు. ఇంతలో వచ్చే ఏడాది రాజ్యసభ సభ్యత్వం గడువు పూర్తవుతుంది. తిరిగి రాజ్యసభకు పంపే అవకాశం లేదు. ఏకంగా ఏపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేసినా ఎవ్వరు వినిపించుకోవడం లేదు. ఇప్పుడు విశాఖపట్నం చుట్టూ తిరుగుతూ, అక్కడి నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు.
సొంతంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి బలం లేని నేత కావడంతో, తానేదో కాపు నాయకుడు అన్నట్లు వ్యవహరిస్తూ కొద్ది రోజులుగా వ్యవహరిస్తున్నారు. కాపు రిజర్వేషన్ తో ప్రారంభించి, తాజాగా ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వరకు వచ్చారు. తానూ ఆ సామాజిక వర్గంకు చెందినవాడినని అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
విశాఖలో ఆ సామాజిక వర్గం ఓటర్లు తగు సంఖ్యలో ఉండడంతో ఆ నినాదం ప్రారంభించినట్లయింది. దేశంలో ఏ సామాజిక వర్గానికి జరగనంత అన్యాయం కాపులకు జరిగిందని, వారి రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గం ఎన్నడూ బిజెపిని నమ్మకపోవడం వేరే విషయం.
మొదటగా కన్నా లక్ష్మీనారాయణను, ఆ తర్వాత సోము వీర్రాజులను రాష్ట్ర అధ్యక్షులుగా చేయడం కాపుల ఓట్లను కొట్టేయడం కోసమే. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా ఉండడంతో, 20 శాతం జనాభా గల కాపుల మద్దతు పొందగలిగితే సొంతంగా రాష్ట్రంలో అధికారంలోకి రాగలమని బీజేపీ నాయకత్వం ఎత్తుగడ వేసింది. అయితే కన్నా సారధ్యంలో 2019 ఎన్నికలలో నోటాకు వచ్చిన ఓట్లు కూడా బిజెపికి రాలేదు. ఇప్పుడు కూడా అంతకన్నా ఆ పార్టీ ఓట్లు మెరుగైన దాఖలాలు లేవు.
జివిఎల్ విశాఖ నుండి పోటీచేయాలి అనుకోవడమే గాని, అక్కడ ఆయనకు సొంతపార్టీలోనే మద్దతు లభించడం లేదు. వైసిపిలో విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడిపే ప్రయత్నం చేసిన విజయసాయిరెడ్డి పార్టీలో నం 2 స్థానం నుండి ఎక్కడిలో వెళ్లిపోవాల్సి రావడం చూస్తున్నాము. ఇప్పుడు జివిఎల్ పరిస్థితి సహితం అంతే అన్నట్లు ఉంది.