రాజకీయ ప్రవేశం కోసమేనా మనోజ్, మౌనిక అత్తారింటి పర్యటన!

Wednesday, December 18, 2024

సినీ నటుడు మనోజ్, రాజకీయ నేపథ్యం గల మౌనిక పెళ్ళయితే గప్ చిప్ గా, కేవలం కుటుంభ సన్నిహితుల మధ్య చేసుకున్నారు గాని, పెళ్లి తర్వాత ఆదివారం అత్తారింటికి వెళ్లే పేరుతో హైదరాబాద్ నుండి కర్నూల్ మీదుగా ఆళ్లగడ్డ వరకు జరిగిన యాత్ర అల్లుడి హోదాలో జరిగిన్నట్లు లేదు. ఇప్పటికే భూమా కుటుంభంలో చిచ్చురేపిన ఆళ్లగడ్డ రాజకీయాలలో ఆధిపత్యం కోసం జరిపిన ర్యాలీగా మారిన్నట్లున్నది.

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రాజకీయ వారసత్వం కోసం కొంతకాలంగా అక్కచెల్లెలైన మాజీ మంత్రి అఖిలప్రియ, మౌనికల మధ్య ప్రచ్ఛన్న పోరు జరుగుతూ ఉండటం బహిరంగ రహస్యమే. వారిద్దరి మధ్య మాటలు కూడా కొంతకాలంగా లేవని చెబుతున్నారు. అయితే, పెద్దమ్మ జోక్యంతో మౌనిక పెళ్లికి అఖిల‌ప్రియ, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌, భ‌ర్త భార్గ‌వ్‌రామ్ హాజ‌ర‌య్యారు.

వచ్చే ఎన్నికలలో తిరిగి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అఖిలప్రియ సిద్దపడుతూ ఉంటె, కొంతకాలంగా ఆమె వివాదాస్పదంగా మారడం, స్థానికంగా వ్యతిరేకత తెచ్చుకోవడంతో టిడిపి అధిష్టానం ఇప్పటివరకు ఆమెను అభ్యర్థిగా ఖరారు చేయలేదు. ఇంతలో మౌనిక రంగప్రవేశం చేసి ఆ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. పార్టీ శ్రేణులలో, భూమా కుటుంభం అభిమానులలో సహితం వ్యక్తిగతంగా అఖిలప్రియ కన్నా మౌనిక పట్ల సానుకూలత ఉన్నట్లు చెబుతున్నారు.

అత్తారింటికి వెళ్లేవారు ఒంటరిగానే, సన్నిహిత కుటుంభం సభ్యులతోనే కలిసి వెడతారు. కానీ 15 వాహ‌నాలతో కూడిన కాన్వాయ్ తో ఏదో దండయాత్రకు వెళ్లినట్లు, హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుండి సోషల్ మీడియాలో వేదేవులు, ఫోటోలతో విశేష ప్రచారం కలిగించడం చూస్తుంటే ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది.

వివాహం జరిగిన హైదరాబాద్ లో ఎటువంటి రిసెప్షన్ లేకుండా నేరుగా ఆళ్లగడ్డలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడమే బలప్రదర్శనకు దిగిన్నట్లు పలువురు భావిస్తున్నారు. 2017లో ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపులో మౌనిక ముఖ్యమైన పాత్ర వహించడం అందరికి తెలిసిందే. అప్పట్లో ఛానెల్స్‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రసంగాలు చూసిన వారికి రాజకీయాలలో బాగా రాణిస్తారని భావించారు.

ఒక వివాదంలో అక్క అఖిలప్రియ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆమెకు మద్దతుగా మీడియాతో ఆమె వ్యవహరించిన తీరు సహితం ఎందరినో ఆకట్టుకొంది. అప్పటి నుండి ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి ఏర్పడినా అక్క, సోదరుడు ఇద్దరూ అప్పట్లో ఎమ్యెల్యేలుగా ఉండడంతో అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికీ తమ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలను ఆమె పర్యవేక్షిస్తూ ఉంటారని తెలుస్తున్నది.

భూమా కుటుంబానికి రాజకీయ కురువృద్దుడిగా భావించే మౌనిక తాతగారైన మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి గారింటికి కర్నూల్ లో మొదటగా వెళ్లి, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత గలిగినదే అని చెప్పవచ్చు. అనంతరం ఆళ్లగడ్డలోని భూమా దంపతుల సమాధులను దర్శించి నివాళులు అర్పించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles