మావోయిస్టు ఉద్యమకారులతో సుదీర్ఘకాలం భాగమై, వారి హింసాయుత రాజకీయాలకు కళాకారుడిగా అండదండలు అందజేస్తూ, వారికి మద్దతుగా పాటలతో గిరిజనులను, బడుగు వర్గాల ప్రజలను సమీకరించేందుకు తోడ్పడిన ప్రముఖ కళాకారుడు గద్దర్ ఇప్పుడు రాజకీయ ఉనికికోసం తంటాలు పడుతున్నారు.
తెలంగాణాలో మావోయిస్టు ఉనికి ప్రశ్నార్ధకరంగా మారడంతో, పోలీస్ వత్తిడులకు తట్టుకోలేక, వివిధ రాజకీయ ఉద్యమాల ద్వారా తన ఉనికి కాపాడుకొనే ప్రయత్నం చేస్తూవచ్చారు. అయితే ఎవ్వరూ దగ్గరకు తీయకపోవడంతో ఒక విధంగా అసహనంతో ఇప్పుడు సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తానంటూ సంకేతం ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలలో సీఎం కేసీఆర్ పై పోటీ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
గత కొంతకాలంగా గద్దర్ ప్రకటనలు, వ్యాఖ్యలు గందరగోళంగా మారాయి. 2018 ఎన్నికలసమయంలో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. స్వయంగా సోనియాగాంధీని కుటుంబ సమేతంగా కలవటంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. తన కుమారుడిని కాంగ్రెస్ లో చేర్పించి, అతనికి ఆ పార్టీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు.
ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో కొంతకాలం మౌనంగా ఉన్నారు. గత ఏడాది సికింద్రాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన బహిరంగసభకు వెళ్లి, బిజెపి శ్రేణులతో కలసి పాటలు కూడా పాడారు. ఆ పార్టీ నాయకులతో సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నించినా వారు పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను కీర్తిస్తూ పాటలు పడినా, ఆ తర్వాత ఉద్యమకారులు అందరి మాదిరిగా గద్దర్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలోనూ పోటీ చేస్తానని ప్రకటన చేశారు. కానీ ఎందుకో వెనకాడారు.
ఇక ఈ మధ్య కాలంలో పలు వేదికలపై మాట్లాడుతున్న ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తాజాగా కూడా ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం కీలక వాఖ్యలు చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో మంగళవారం పోలీసులను కలిసిన గద్దర్ ఈ ఏడాది తనకు రక్షణ కల్పించాలని కోరారు. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. తన సొంత గ్రామంపై ఓ పుస్తకం రాసినట్టు గద్దర్ ప్రకటించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన లేఖ గద్దర్ పేరుతో ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
దానితో గద్దర్ రాజకీయ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే మొన్నటి వరకు పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. అయితే గజ్వేల్ నుంచే పోటీ అని గద్దర్ చెప్పటంతో ఆ ప్రచారానికి చెక్ పడిందనే చెప్పొచ్చు. త్వరలోనే కవులు, కళాకారులతో కలిసి భారీ సమ్మేళనానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తారా? ఏదైనా పార్టీని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను నిలబెడతారు? తెలవలసి ఉంది.