రసాభాసగా మారిన విశాఖలో గ్లోబల్ సమ్మిట్

Friday, November 22, 2024

విశాఖపట్టణంలో  ఆర్భాటంగా శుక్రవారం ఉదయం ప్రారంభమైన రెండు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు మధ్యాహ్నం అయ్యేసరికి రసాభాసగా మారింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దేశ విదేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సును అధికార పార్టీ సమావేశం స్థాయిలో నిర్వహించే ప్రయత్నం చేసి అవమానంకు గురయ్యారు.

అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సదస్సు నిర్వహణ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొనక పోవడం, ముఖ్యంగా ఎవ్వరెవ్వరు హాజరుకావాలో నిబద్దత పాటించకపోవడంతో వీధులలో జరిగే సమావేశాలలో మాదిరిగా తొక్కిసలాటకు దారితీసింది. ఉదయం హుందాగా ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైనా మధ్యాహ్నం వచ్చేసరికి  అల్లరిచిల్లరిగా మారింది.

పెట్టుబడులతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో అక్కడ చేసిన ఏర్పాట్లకు, వచ్చిన జనానికి సంబంధం లేకుండా పోయింది.  లోపలకు వచ్చిన పెట్టుబడిదారులు, ప్రతినిధులు ఒకసారి ఏదైనా పనిపై బైటకు వస్తే, తిరిగి లోపలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పెట్టుబడులు పెట్టేవారి కన్నా సీఎం వైయస్ జగన్ కు జైజైలు కొట్టడంకోసం అన్నట్లుగా ఉచితంగా నమోదు చేసుకున్న వారిని ఎక్కువగా అనుమతించడంతో అంతా గందరగోళంకు దారితీసింది.

సుమారు 15 వేలమంది ఉచిత ప్రతినిధులుగా నమోదు చేసుకోగా, వారందరిని లోపలకు అనుమతించడం అధికారులకు సమస్యాత్మకంగా తయారైంది. అసలు ఎవ్వరు ప్రతినిధులు, ఎవ్వరు పెట్టుబడిదారులు, ఎవ్వరు ప్రేక్షకుల్లో తెలియక తికమక పడవలసి వచ్చింది.

భోజన విరామం సమయంలో ప్రతినిధులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా విదేశీ ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామని, సాధారణ ప్రతినిధులను మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత అనుమతిస్తామని చెప్పడంతో చాలా సేపు వారు వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో భోజనాల దగ్గర తొక్కిసలాట జరిగింది. వారిని నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తిసినట్లు తెలియవచ్చింది.

కిట్‌లు, భోజనాల కోసం కుమ్ములాట జరగడంతో అంతా రసాభాసగా మారింది. దానితో కిట్ లు ఇచ్చే  రిసెప్షన్ కేంద్రం వద్ద తోసుకుంటూ వచ్చి, మొత్తం దాన్ని ధ్వంసం చేసినంతపని చేశారు. ఎవ్వరికీ అందిన కిట్ లను వారు తీసుకు వెళ్లిపోయారు. డెలిగేట్ రిజిస్ట్రేషన్ దగ్గర.. నిర్వాహకులు అందరికీ కిట్లు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు.. ఏకంగా కౌంటర్‌ను పీకేశారు.

వెంటనే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అయినా ఫలితం లేకపోయింది. వాళ్లు వచ్చేసరికే మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కౌంటర్ మొత్తాన్ని ప్రతినిధి పాస్ హోల్డర్లు పీకేశారు. ఇంత  జరుగుతున్నా అక్కడ పోలీసులు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.

భోజనాల వద్ద కూడా కొందరు ముఖ్య అతిధులకే భోజనాలు లేకపోయాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపిన సదస్సు నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లననే ఈ విధంగా జరిగినట్లు స్పష్టం అవుతుంది. పలు దేశాల రాయబారులు సహితం హాజరైన ఈ సదస్సు నిర్వహణ ఈ విధంగా గందరగోళంగా మారడం అందరికి విస్మయం కలిగిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles