అసలుకే తమతో కలిసిపోయి, తాము చెప్పిన్నట్లు వింటున్న గవర్నర్ ను అర్ధాంతరంగా, మాటమాత్రం కూడా చెప్పకుండా కేంద్రం మార్చివేయడంతో దిగాలుపడిన పరిస్థితులలో కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు నేరుగా ఢిల్లీలోని ఆయన నివాసంపై వెళ్లి శుభాకాంక్షలు తెలపడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉలిక్కిపాటుకు గురయిన్నట్లు తెలుస్తున్నది.
పైగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించడంతో ఇప్పటి మాదిరిగా అడ్డదిడ్డంగా జారీచేసే ఉత్తరువులపై సంతకం చేయకపోవచ్చని కలవరం చెందుతున్నారు. అటువంటి పరిస్థితులలో రఘురామకృష్ణంరాజు అరగంటసేపు ఆయనతో భేటీ ఏకావడమే కాకుండా, రాష్ట్రంలోని పరిస్థితులను కూడా వివరించానని చెప్పడం ఆందోళన కలిగిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని గ్రహించే కేంద్ర పెద్దలు రాజకీయ నాయకుణ్ని కాకుండా రాజ్యాంగ కోవిదుడుని నియమించారని ఈ సందర్భంగా రామకృష్ణంరాజు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత గవర్నర్ కనీసం న్యాయసలహానూ కూడా తీసుకొనే ప్రయత్నం చేయకుండా గ్రుడ్డిగా సంతకం చేసిన అనేక ఉత్తరువులను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. ఇకముందు అటువంటి పరిస్థితులు ఏర్పడకపోవచ్చని భావిస్తున్నారు.
రామకృష్ణంరాజు ముందుగా కొత్త గవర్నర్ ను కలవడంతో ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు ఏమి చేస్తున్నారంటూ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దానితో ఆఘమేఘాల మీద పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం సాయంత్రం వెళ్ళి కొత్త గవర్నర్ ను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఏదేమైనా, ప్రస్తుత గవర్నర్ మాదిరిగా ఏకపక్షంగా వ్యవహరింపకుండా కొత్త గవర్నర్ అయినా కొంచెం క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి.
ఇప్పటికే రాష్త్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై, పలువురు ఉన్నతాధికారులపై అనేక కోర్టు ధిక్కరణ కేసులు విచారణలో ఉన్నాయి. స్వయంగా హైకోర్టు న్యాయమూర్తులపైననే అధికార పక్షం నేతలు విద్వేష ప్రచారం సాగించిన చరిత్ర ఉంది. ఇటువంటి పరిస్థితులలో మాజీ న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ వహించే పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.