రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నా.. చీమకుట్టినట్టయినా స్పందించరు. కదలరు, మెదలరు.. అనే అపకీర్తి మూటగట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజల కష్టాలు తీర్చడానికి, కాదు కాదు, వాళ్ల విలాపాలు అన్నీ ఒకచోట క్రోడీకరించడానికి ఒక సరికొత్త టెక్నాలజీ బాటను అనుసరిస్తున్నారు. పట్టణాల్లో ప్రజలకు కష్టాలు ఉంటే వాటిని యాప్ లో రిజిస్టరు చేస్తే చాలు.. చిటికెలో మాయమైపోతాయి అని అంటున్నారు. ఏ మార్గంలో అయినా ప్రజల సమస్యలు చిటికెలో మాయమైతే చాలా మంచిదే. కానీ.. అందుకు చాలా చిత్తశుద్ధి కావాలి. అంతటి చిత్తశుద్ధి ఈ సర్కారుకు ఉన్నదా అనేదే కీలకాంశం.
మునిసిపాలిటీ శాఖ వారు కొత్తగా ఒక యాప్ ను తయారు చేశారు. పట్టణాల్లో ఏ సమస్య కనిపించినా దాన్ని ఇట్టే యాప్ లో నమోదు చేసేయవచ్చునట. అంటే ఫరెగ్జాంపుల్ వీధిలైట్లు వెలగకపోయినా, పబ్లిక్ లెట్రిన్లు కావాలన్నా.. ఇలా ఏవైనా సరే యాప్ ద్వారా చెప్పవచ్చు. అవి అధికారుల దృష్టికి వెళతాయి. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే.. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజలు ఎవరైనా సరే ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు.. అని కూడా అంటున్నారు.
యాప్ లు ఎప్పుడూ బాగానే ఉంటాయి. అందంగానూ ఉంటాయి. ఎందుకంటే కొత్త టెక్నాలజీతో వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండవచ్చు. కానీ.. ఆ యాప్ ల వాడకం ఎందరికి అందుబాటులో ఉంటుంది? మరియు, అందులో సమస్యలను ప్రభుత్వానికి నివేదించగల తెలివితేటలు, జ్ఞాన సంపద మన దేశంలో ఎందరికి ఉంటుంది? ఇది చాలా కీలకమైన విషయం. పైగా, యాప్ అంటూ ఒకటి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రజలెవరైనా నేరుగా వినతిపత్రాలతో వెళితే.. కాగితాలు తీసుకోం వెళ్లి యాప్ లో రిజిస్టరు చేయమని అధికారులు విసుక్కునే ప్రమాదమూ ఉంది.
ఇంకో సంగతిని ఇక్కడ కీలకంగా గమనించాలి. ప్రజల సమస్యలు తీరడం అనేది అధికారుల్లో చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. ఇన్నాళ్లుగా వారి సమస్యలు తీరకుండా ఉంటున్నాయంటే.. దాని అర్థం ఆ సమస్యలు పాలకుల, అధికారుల, ప్రభుత్వం దృష్టికి రావడం లేదు అని కాదు కదా. వచ్చినాసరే వారు పట్టించుకోవడం లేదు అని అర్థం. జనం నేరుగా వెళ్లి మొర పెట్టుకుంటే.. కాగితాలు ఇచ్చి మా కష్టాలు తీర్చండి మొర్రో అని వేడుకుంటే స్పందించని అధికారగణాలు.. యాప్ లో రిజిస్టరు అయినంత మాత్రాన వెంటనే వాటిని చేసేస్తారా? అనేది సందేహం.
అలాంటిది ఇలాంటి నిరుపయోగమైన ఒక యాప్ గురించి మునిసిపాలిటీ శాఖ వాళ్లు వచ్చి తనకు వివరించగానే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న చందంగా, ఎలాంటి తార్కికమైన ఆలోచన కూడా లేని ముఖ్యమంత్రి జగన్, ఇలాంటి యాప్ గ్రామాలకు కూడా ఒకటి తయారు చేయాలని ఆదేశించడం పెద్ద కామెడీ!
ఇవన్నీ ఒక ఎత్తు.. జగన్ రెడ్డి చెబుతున్నట్లుగా ఓ పౌరుడు, గోతులు పడ్డ రోడ్డును ఫోటో తీసి యాప్ లో అప్‌లోడ్ చేశాడని అనుకుందాం. దాని మీద స్పందించి, ఎవరికైనా ఆ పనిని కేటాయించి వర్క్ పూర్తిచేయించే శ్రద్ధ ప్రభుత్వానికి ఉందా? యాప్ లో అప్ లోడ్ అయిన నాటినుంచి నిర్దిష్ట కాల వ్యవధి లోగా ఆ సమస్య పరిష్కారం కావాలని, లేని పక్షంలో అధికార్ల మీద చర్యలుంటాయని జగన్ చెప్పగలరా? ఇదంతా ఓకే, ఒక గోతిని కాంట్రాక్టరు పూడ్చిన తరువాత.. అతనికి బిల్లులు ఎంతకాలానికి చెల్లించగలదు ఈ ప్రభుత్వం? అయిదారేళ్ల బిల్లులు కూడా పెండింగులో పెట్టుకుని కాంట్రాక్టర్లు పనులే వద్దు మొర్రో అనుకుంటూ తిరుగుతున్నారు. ఒక బిల్లు పెండింగులో పడితే.. మరో గోతిని పూడ్చడానికి కాంట్రాక్టరు మళ్లీ ముందుకు వస్తాడా? ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సమస్యలు. ప్రభుత్వం గానీ, మరో ముప్ఫయ్యేళ్ల పాటు సీఎం కుర్చీలో తానే ఉండాలని కలగంటున్న జగన్ గానీ ఆలోచించాల్సిన విషయాలు.