యాదగిరిగుట్టపై తడిబట్టలతో ప్రమాణంతో బండి సంజయ్ కు చేటు!

Friday, November 15, 2024

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటివారు బహిరంగసభలలో తనపై పొగడ్తల వర్షం కురిపిస్తుండడంతో తెలంగాణాలో తనకు తిరుగులేదనుకొంటూ ఎవ్వరిని లెక్క చేయకుండా వ్యవహరించిన బండి సంజయ్ రాష్త్ర అధ్యక్ష పదవిని కోల్పోవలసి వస్తుందని ఊహించనే లేదు. 

చివరకు తనను రాష్త్ర అధ్యక్షునిగా నియమించడం కోసం ఎంతో కష్టపడినా వారిని సైతం లెక్క చేయకుండా, రాష్ట్రంలోని పార్టీ నేతలను ఎవ్వరిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే వచ్చారు.  తలపై పలువురు నాయకులు బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నా కనీసం సర్దుబాటు చేసుకొనే ప్రయత్నం చేయలేదు.

తనపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తనకు ఢిల్లీ పెద్దల అండదండలు ఉన్నాయనే ధీమాతో ఉండేవారు. అందుకు తగ్గట్టు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్, రాష్త్ర ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ వంటి వారు కూడా సంజయ్ పై ఏమైనా ఆరోపణలు చేసినా పట్టించుకొనేవారు కాదు. ఒక సీనియర్ మహిళానేత వెళ్లి తనను లైంగికంగా వేధించాడని ఆర్పిస్తే “నా రాష్ట్ర అధ్యక్షుడిపై ఆరోపణలు చేసి పార్టీలో ఉందామనేనా?” అంటూ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొదట్లో సంజయ్ తో జట్టుగా తిరిగిన నిజామాబాద్ ఎంపీ డి అరవింద్ ను లెక్కచేయక పోవడంతో సంవత్సర కాలంగా ఇద్దరి మధ్య మాటలే కరువయ్యాయి. కరీంనగర్ పట్టణంకు చెందిన నాయకుడిని రాష్త్ర అధ్యక్షునిగా చేస్తే తన చెప్పుచేతలలో ఉంటారని అంటుకొని రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు సంజయ్ ను అధ్యక్షునిగా చేయడం కోసం ఎంతో కృషి చేశారు. తీరా ఆయన అధ్యక్షుడైన తర్వాత మంత్రి శ్రీనివాసులు మీదనే ఢిల్లీలో ఫిర్యాదులు చేసి, ఆయనను పంజాబ్ కు పంపించివేశారు.

తన ప్రమేయం లేకుండా పార్టీలో చేరిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి వారి పట్ల మొదటి నుంచి వ్యతిరేకంగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం పార్టీలో ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జ్ గా పనిచేసిన పేరాల చంద్రశేఖర్ వంటి వారిపై కుట్రపూరితంగా వ్యవహరించారు. 

రాజకీయంగా మనుగడ కోల్పోయి, మరో దిక్కులేక బీజేపీలో చేరిన కొందరు మాజీ నేతలను మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చారు.  సంజయ్ ను కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన మద్దతుదారులు నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. వారం రోజుల క్రితమే కేసీఆర్ కుట్రపూరితంగా తనను అధ్యక్ష పదవి నుండి తీసివేస్తున్నట్లు ఒక వర్గం మీడియాలో ప్రచారం చేయిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.

వచ్చే ఎన్నికలలో సీట్ల పంపిణీలో తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకోవడం కోసం పలు నియోజకవర్గాలలో ఇప్పటికే `మీరే అభ్యర్థులు’ అంటూ భరోసా కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు ఐదు నెలల ముందు అధ్యక్ష పదవి కోల్పోవడంతో దిమ్మతిరిగిన్నట్లయింది.  తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మే యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి `శాపం’ తగిలిందా అనే ప్రచారం ఇప్పుడు బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.

ఎమ్మెల్యేలకు ఎర కేసుతో అడ్డంగా బీజేపీ అడ్డంగా పట్టుబడిపోయినా తమ పార్టీకి ఏమాత్రం  సంబంధం లేదని అడ్డగోలుగా వాదించిన బండి సంజయ్‌ ఏకంగా యాదగిరిగుట్టపై తడిబట్టలతో ప్రమాణం చేశారు. అప్పుడే చాలామంది అగ్గితో ఆటలాడుతున్నారంటూ హెచ్చరికలు చేశారు. గత సంవత్సరం అక్టోబర్ 28న ప్రమాణం చేయగా, ఎనిమిది నెలలకే  అధ్యక్ష పదవిని సంజయ్ పోగొట్టుకున్నారు.

ఒకవేళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చాలని భావించినట్లయితే కనీసం ఆరు నెలల క్రితమే ఈ పని చేసి ఉన్నట్లయితే పార్టీకి ఇంతటి డ్యామేజీ జరిగి ఉండేదికాదని అంటున్నారు. ఒకవేళ ఎవ్వరికైనా అసంతృప్తులు ఉండివుంటే ఈపాటికి సద్దుమణిగేయని, అందరూ ఎన్నికల సమరంలో మునిగిపోయేవారని భావిస్తున్నారు. 

అధిష్టానం చేసిన హితబోధలను కొత్తవారికి తెలియనీయకుండా, అందరినీ కలుపుకొనిపోతూ వారి సీనియారిటీని, వయస్సును గౌరవిస్తూ (అలా నటిస్తూ)నైనా బండి సంజయ్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఇంతటి ఉపద్రవం సంభవించేది కాదని అంటున్నారు. ఇప్పుడు పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles