అమరావతిలో రాజధాని కొనసాగింపుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉత్తరువు కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా, మొత్తం సమస్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైపు నెట్టిన్నట్లు కనిపిస్తున్నది. కేవలం ఆరు నెలల్లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాత్రమే స్టే ఇస్తూ, రాజధాని కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్టు అయింది.
రాజధాని విషయంలో చట్టసభలు కాకుండా హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయని అక్షింతలు వేస్తున్నట్లు కనిపిస్తూనే పార్లమెంట్ చేసిన చట్ట ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని, రాష్ట్ర శాసనసభ ఏ విధంగా మాఅరుస్తుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం. ఈ సమస్యపై తమ వాదనను జనవరి 30 లోగా తెలిపామని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా, స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసింది మోదీ ప్రభుత్వమే అని తేల్చి చెప్పిన్నట్లు స్పష్టం అవుతుంది.
ఇప్పటివరకు రాజధాని విషయంలో బిజెపి, కేంద్ర ప్రభుత్వం ద్వంద ప్రమాణాలు పాటిస్తూ, ఓ విధంగా తమ ప్రమేయం లేదన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. రాజధాని అమరావతిలో కొనసాగ వలసిందే అని బిజెపి చెబుతుండగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అని, తమకు సంబంధం లేదని అంటూ కేంద్ర ప్రభుత్వం రెండు, మూడు సార్లు రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది.
అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తర్వాత దాని అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, పైగా పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ అమరావతికి వ్యతరేక శక్తులకు ఊతం ఇస్తున్నారనే విమర్శలు ఆ ప్రాంతంలో నెలకొనడం గమనార్హం.
హైకోర్టును కుర్నూలకు మార్చే విషయంలో కూడా బిజెపి కర్నూలుకు మార్చాలని అంటుండగా, కేంద్ర ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలసి నిర్ణయించాలని, తమ ప్రమేయం లేదని తప్పించుకొనే ధోరణి అవలంభిస్తూ వస్తున్నది. అయితే రాష్ట్రపతి ఉత్తరువు ద్వారా అమరావతిలో నెలకొల్పిన హైకోర్టును కర్నూలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మారుస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనార్హం.
మూడు రాజధానులు తాము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు నిత్యం ప్రచారం చేసుకొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్ మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశంపై ఒక వంక రాష్ట్ర ప్రభుత్వ నేతలు కొంత ఊరట లభించినట్లే భావిస్తుండగా, రైతు నాయకులు, ప్రతిపక్షాలు సహితం కీలక అంశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదని ఊపిరి పీల్చు అంటున్నారు. అయితే, చివరకు కేంద్ర ప్రభుత్వంకు, బిజెపి నేతలకు మాత్రమే ఈ ఆదేశాలు ఇరకాటంలో పడే పరిస్థితి కల్పిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ విషయంలో వారు అనుసరిస్తున్న దొంగచాటు వ్యవహారాలు కొనసాగించే అవకాశం లేకుండా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.