మోదీ పర్యటనకు బిఆర్ఎస్ బహిష్కరణ.. కేసీఆర్ గైరాజర్

Friday, November 22, 2024

వరంగల్ చరిత్రలోనే రెండో సారి ఓ ప్రధాన మంత్రి అధికార పర్యటనకు వస్తున్నారు. మొదటిసారిగా 30 ఏళ్ళ క్రితం తెలుగు వాడైనా పివి నరసింహారావు ప్రధానిగా వచ్చి పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనగా, ఇప్పుడు శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. 

ఒక వంక బిఆర్ఎస్ – బీజేపీ రాష్ట్రంలో లాలూచీ రాజకీయాలు చేస్తున్నట్లు అందరూ భావిస్తుండగా, ఈ సారి కూడా ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బిఆర్ఎస్ నేతలు ప్రకటించడం ద్వారా ఆ పార్టీతో తమకేమీ సంబంధం ఉన్నట్లు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు.ఇంకోవైపు కాంగ్రెస్ బిజెపికి బిఆర్ఎస్ `బి టీమ్’ అని విమర్శలు గుప్పిస్తుండగా, కాదు, `కాంగ్రెస్ కు బిఆర్ఎస్ బి టీమ్’ అంటూ బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

గత రెండేళ్లుగా ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ సారి కూడా గైరాజర్ అవుతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మంత్రులు జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ `తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ’ అంటూ తీవ్రంగా విమర్శలు కురిపించారు.

ప్రధాని మోదీ తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని మండిపడుతూ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు.  “తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు” అని స్పష్టం చేశారు.

విభజన హామీలను ప్రధాని మోదీ  ఒక్కటి కూడా నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. గుజరాత్‌కు రూ.20 వేల కోట్లతో కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ‘‘నీ రాష్ట్రంలో 20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ. తెలంగాణకు మాత్రం 520 కోట్లతో వ్యాగన్ ఫాక్టరీనా. మాకేమైనా భిక్షం వేస్తున్నారా?” అంటూ ప్రధాని మోదీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని కేటీఆర్  నిలదీశారు. బిజెపికి బిఆర్ఎస్ `బి టీం’ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తుండగా, ప్రధాని మోదీని, బీజేపీని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎందుకు విమర్శించరని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొంటూ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అని చెబుతూ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించడాన్ని కేటీఆర్ తిప్పికొట్టారు.  ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

గాంధీ భవన్‌లో గాడ్సే దూరాడని అంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి అని ఆరోపించారు. ప్రధాని మోదీ  పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో బిజెపి గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ పుంజుకుంటూ ఉండడంతో ఒక వంక బిఆర్ఎస్, మరోవంక బిజెపి కూడా ఖంగారు పడుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles