గత ఎన్నికలలో ఏపీ ప్రజలు బిజెపిని నోటాకన్నా తక్కువ ఓట్లతో అవమానకరంగా తిరస్కరించారు. మరోవంక అనూహ్యంగా భారీ మెజారిటీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు నెట్టివేసి, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన్నట్లు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు.
ప్రధానికి బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తండ్రి ఎంతో కష్టపడి నిర్మించిన కృష్ణపట్నం ఓడరేవును కట్టబెట్టారు. అంతేకాదు, రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లను అప్పచెప్పారు. చివరకు అదానీకి భార్యకు రాజ్యసభ సీట్ కూడా ఇవ్వచూపారు. ఐతే తనకు కావలసింది ఇక్కడి సంపదకాని, తన కనుసన్నలలో ఉండే ఎంపీలు ఉన్నప్పుడు తన భార్యకు ఎంపీ సీటు ఎందుకంటూ సున్నితంగా తిరస్కరించడంతో ఇవ్వలేక పోయారు.
తాజాగా, విశాఖపట్నం పరిసరాలలో 75 వేల ఎకరాల భూములను అదానీకి కట్టబెడుతున్నారు. . రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారం గ్రామసభ అనుమతి లేకుండా భూముల బదలాయింపు చేయకూడదు. దీనికి భిన్నంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అదానీకి చెందిన సంస్థకు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి, ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించాలని చూడడం తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.
విశాఖ నగరంలోని మధురవాడలో అదానీ డేటా సెంటర్ పేరుతో రూ.వేల కోట్లు విలువైన 400 ఎకరాల భూమిని కేవలం రూ.130 కోట్లకే అదానీకి ధారాదత్తం చేస్తున్నారు. గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాను ఎలాంటి బిడ్డింగూ లేకుండా బదలా ఇస్తున్నారు. ఇవ్వన్నీ ప్రధాని మోదీని మెప్పించడం కోసమే అనడంలో సందేహం లేదు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా కార్మికులు, ప్రజానీకం రెండేళ్లుగా ఉద్యమం చేస్తోన్నా దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకెళ్లి ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని వైసీపీ పెద్దలు చెప్పి ఇంతవరకు తీసుకెళ్లనే లేదు. పోస్కో పేరును ముందుకు తీసుకొచ్చి అదానీ ఈ ప్లాంట్‌ను కూడా కాజేయాలని చూస్తున్నాడని ఆరోపణలు తలెత్తుతున్నాయి.
ఇటీవల విశాఖపట్నం బహిరంగసభలో ప్రధాని సమక్షంలోనే తనకు కేంద్రంతో ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతమైనదని చెప్పుకోవడం చూసాము. ఇక, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎపి జెన్‌కోను కూడా అదానీకి అప్పగిస్తున్నారు. మరోవంక, దోచుకోవాలని చూస్తోన్న హిందూజా సంస్థకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది.
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా యూనిట్‌ను రూ.3.82కు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే, హిందూజా యాజమాన్యం తన లాభాల కోసం ఎక్కువ మొత్తానికి కొనాలని ప్రభుత్వాన్ని కోరగా, ప్రభుత్వ ఖజానాకు కన్నం పడుతుందని తెలిసి కూడా జగన్ న్యాయ సలహాకు వెళ్లడం గమనార్హం.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే పరిపాలన రాజధానిని విశాఖపట్నంకు మారుస్తున్నట్లు చెబుతున్న జగన్, నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులివ్వాలని, స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించాలని ఆ ప్రాంత ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాలపై నోరు మెదిపే ధైర్యం చేయలేక పోతున్నారు.
అదానీ ద్వారా రాజకీయంగా మోదీ ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేయకుండా, తనపై ఉన్న అవినీతి కేసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడం కోసమే జగన్ ఎక్కువగా తాపత్రయపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.