మోడీ వ్యతిరేకుల్లో చీలిక తెచ్చే మరో అస్త్రం!

Wednesday, January 22, 2025

ఉమ్మడి పౌర స్మృతి అనేది దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలను ఆకట్టుకోవడానికి, భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదిలో ఇంకా మిగిలి ఉన్న బ్రహ్మాస్త్రాలలో ఒకటి! యూనిఫారం సివిల్ కోడ్- ఉమ్మడి పౌరస్మృతి అనే ఈ ఆలోచనకు దేశంలో కేవలం బిజెపి సానుభూతిపరులు, హిందుత్వవాదుల నుంచి మాత్రమే కాకుండా తటస్థుల నుంచి కూడా మద్దతు ఉంది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఒక అడ్వాంటేజీ ఉంటుందని మాత్రమే ఇప్పటిదాకా అందరూ ఊహిస్తూ వచ్చారు. కానీ ఈ బిల్లు గురించి ప్రతిపాదించడం ద్వారా మరో అనూహ్యమైన ప్రయోజనాన్ని బిజెపి పొందుతోంది. మోడీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న విపక్ష పార్టీల కూటమిలో ఇది చీలిక తెస్తోంది. విపక్షాల్లోని వివిధ పార్టీలు దీనిపట్ల వివిధ రకాలుగా స్పందిస్తున్నాయి.

ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత ప్రశ్నార్థకంగా ఉంది. ఢిల్లీలో అధికారుల బదిలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును స్పష్టంగా వ్యతిరేకిస్తే తప్ప తాము విపక్ష కూటమిలో కొనసాగబోమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో ఆప్ కోరుకుంటున్నట్లుగా స్పందించడానికి ఆ ఆర్డినెన్సును వ్యతిరేకించడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదు. విపక్ష పార్టీలలో రెండు రాష్ట్రాలలో అధికారం వెలగబెడుతున్న ఆప్ లాంటి బలమైన పార్టీని ఈరకంగా విపక్ష కూటమికి దూరం చేసుకోవడానికి కాంగ్రెస్ కారణం అవుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి పౌరస్మృతి తెరమీదకు వస్తోంది. ప్రజలలో తటస్తులు కూడా దీనికి మద్దతు ఇస్తున్న తీరుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీనికి తాము అనుకూలమే అని తేల్చి చెప్పింది. అయితే దీనిని అమలు చేసే క్రమంలో అన్ని భాగస్వామ్య పార్టీలతోనూ విస్తృత సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయం తీసుకురావాలి అనేది ఆప్ తమ అభిప్రాయంగా తెలియజేసింది.

మోడీ సర్కారును దాదాపుగా అన్ని విషయాల్లోనూ వ్యతిరేకించే ఆప్, ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఇలా అనుకూలంగా మాట్లాడడం.. బిజెపికి మేలుచేసే సంగతి. ప్రజల్లో దీనిపట్ల ఆలోచన కూడా మారుతుంది.

యూనిఫారం సివిల్ కోడ్ లాంటి ఆలోచనను ఏకపక్షంగా, ఘాటుగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఆప్ ఆలోచనతో ఏకేభవిస్తుందని అనుకోవడం భ్రమ. ఆ రకంగా చూసినప్పుడు విపక్ష కూటమిలో మరిన్ని లుకలుకలు ఏర్పడడానికి ఇది కారణం అవుతుంది. ఇప్పటికే భారాసను విపక్ష కూటమికి దూరం చేసుకున్నారు. కెసిఆర్ ను కూటమి వైపు రానిచ్చే అవకాశం లేదని కూడా రాహుల్ ప్రకటించారు. విపక్షాల మధ్య అనైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వారు ఎలా ముందుకు వెళతారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles