కన్నడసీమలో రాజకీయ సమీకరణాలు చిటికెలో మారిపోయాయి. నిన్నటిదాకా ఎన్నికల పర్వంలో పరస్పరం నిందారోపణలు చేసుకున్న రాజకీయ పార్టీలు ఇంతలోనే చెట్టపట్టాలు వేసుకుని ముందుకు సాగుతాం అంటున్నాయి. ఏ ఇతర పార్టీని చేరదీయాల్సిన అవసరం లేని సంపూర్ణమైన మెజారిటీ కలిగి ఉన్న కాంగ్రెస్ విషయం స్పష్టంగానే ఉన్నది. అయితే భారతీయ జనతా పార్టీతో తాము జట్టుకట్టి నడుస్తాం అంటూ జేడీఎస్ సారథి, మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించేశారు. నిజానికి జేడీఎస్ అధినాయకుడు.. మాజీ ప్రధాని దేవెగౌడ అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సంబంధించి తుదినిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనే తనకే ఇచ్చినట్టుగా కుమారస్వామి చెప్పుకుంటున్నారు.
బిజెపి జేడీఎస్ రెండు పార్టీలు కూడా ప్రస్తుతం ప్రతిపక్షంలోనే ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినంత మాత్రాన వారు అధికారంలోకి వచ్చే అవకాశం ఇసుమంతైనా లేదు. 224 సీట్లున్న కర్నాటక అసెంబ్లీలో 135 స్థానాలతో తిరుగులేని మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తోంది. బిజెపి ఖాతాలో 66, జెడిఎస్ ఖాతాలో 19 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయినా సరే.. ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా శాసనసభలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం అనే నిర్ణయానికి రావడం చోద్యమే. ఈ రెండు పార్టీలు జట్టుకడితే.. కుమారస్వామినే ప్రధాన ప్రతిపక్ష నేతగా బిజెపి ప్రకటిస్తుందనే ప్రచారం ఉంది.
కేవలం ఆ రకంగా కుమారస్వామిని తమ జట్టులోకి తీసుకోవడం కోసమే.. ఎన్నికలు పూర్తయి నెలలు గడచిపోతున్నప్పటకీ.. బిజెపి ఇప్పటిదాకా తమ శాసనసభాపక్ష నేతను కూడా ప్రకటించలేదనే ప్రచారం ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు అన్నీ మోడీకి వ్యతిరేకంగా జట్టు కడుతూ ఉండగా.. కుమారస్వామి బిజెపివైపు మొగ్గు చూపడం కీలకమైన సంగతి. ప్రస్తుతానికి తమ బంధం అసెంబ్లీ వరకే పరిమితం అవుతుందని..పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల గురించి ఇంకా చర్చించుకోలేదని కుమారస్వామి అంటున్నారు. ఆయన అలా అన్నప్పటికీ.. అంతిమంగా అప్పటికి పొత్తులు ఉంటాయనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంటు ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని అధికారపక్షం తిరుగులేని మెజారిటీతో మళ్లీ గద్దెమీదికి వస్తే.. కర్నాటక సీమలో కాంగ్రెసును చీల్చి సంకీర్ణంగా అధికారం చేపట్టడం కుదురుతుందనే సుదూర వ్యూహం కూడా వీరి కలయిక వెనుక ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.