పార్లమెంట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలంటే చాలా కీలకంగా భావిస్తుంటారు. మొత్తం ప్రభుత్వ వ్యవహారాలపై ఒక విధంగా సమీక్ష జరిపే అవకాశం. అయితే రానురాను వీటిని మొక్కుబడిగా, గత్యంతరం లేక అన్నట్లు జరిపించి వేస్తున్నారు. వరుసగా రెండో ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేసీఆర్ వారం రోజులతో ముగించారు. గతంలో నెలన్నర రోజులపాటు జరుగుతూ ఉండెడిది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కూడా రెండు, మూడు వారాలకు పైగా జరిపేవారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు, గవర్నర్ ప్రసంగం రోజులను మినహాయిస్తే ఐదు రోజుల పాటు మాత్రమే జరిగాయి. ఈ ఐదు రోజులలో సహితం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసేందుకు సమావేశాలను ఉపయోగించుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి కాకుండా కేంద్ర బడ్జెట్ గురించి కేసీఆర్ ఎక్కువగా మాట్లాడటం గమనార్హం.
మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వారం రోజులతో ముగిసిన దాఖలాలు లేవు. పైగా, ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితికి ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సంవత్సరం చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది. దేశంలో ఇంత తక్కువ కాలం బడ్జెట్ సమావేశాలు జరగడం ఇప్పటి వరకూ చూడలేదని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సారి సభ నిర్వహణ తీరు చూస్తే.. ఇవి తెలంగాణ బడ్జెట్ సమావేశాలా ? లేక కేంద్ర బడ్జెట్ సమావేశాలా ? అనే అనుమానం కలిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి .. పూర్తి సమయాన్ని మోడీ ప్రభుత్వంపై దాడి చేయడానికే ఉపయోగించుకున్నారని విమర్శించారు.
రెండున్నర దశాబ్దాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని, కానీ ఇంత తక్కువ కాల బడ్జెట్ సమావేశాలను ఇంతవరకు చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వాపోయారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా, ప్రభుత్వం వాటిపై చర్చకు అనుమతించ లేదని చెప్పారు. కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సమావేశాలను బీఆర్ఎస్ ఉపయోగించుకుందని విమర్శించారు.
అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం చూస్ బీఆర్ఎస్ సర్కార్ రెండవ టర్మ్ లో… ఇప్పటి వరకూ కేవలం 69 రోజులే సమావేశాలు నిర్వహించిందని, 2022 లో కేవలం 10 రోజులే జరిపిందని వెల్లడవుతుంది. 2014 నుంచి 2018 మధ్య మొదటి టర్మ్ లో 126 రోజులు సమావేశాలు జరిపారు. అంటే, గత ప్రభుత్వాలు ఒక సంవత్సరంలో జరిపినన్ని రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను మొత్తం ఐదేళ్లలో కూడా కేసీఆర్ జరపడం లేదు.
సభను 20 రోజులు నిర్వహించాలని పట్టుబట్టామని.. కానీ ప్రభుత్వం అతి తక్కువ రోజులే సమావేశాలు నిర్వహించిందని విమర్శించారు.. మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.