దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విడతలవారీగా మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఒక కాలేజీని కూడా మంజూరు చేయకుండా వివక్షత చూపుతున్నట్లు తెలంగాణ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, కాలేజీలు మంజూరు చేశామని అంటూ కేంద్ర మంత్రులు ఒకొక్కరు ఒకొక్క లెక్క చెబుతూ ప్రజలలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 3 కళాశాలలు మంజూరు చేశామని చెప్పగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం 6 కాలేజీలు కేటాయించామని తెలిపారు. పైగా, ఆర్ధిక మంత్రి మరోమాట అన్నారు. ఇప్పటికే కాలేజీలు ఉన్న జిల్లాలకు ప్రతిపాదనలు పంపడంతో మంజూరు సాధ్యం కాలేదని తెలిపారు.
మరోవంక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, ఇతర బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఈ మధ్య మాట్లాడుతూ ఈ స్కీమ్ కింద నిర్దేశించిన నియమ నిబంధనల మేరకు తెలంగాణలోని జిల్లాలకు కొత్త మెడికల్ కాలేజీలు పొందేందుకు అర్హత లేదని స్పష్టం చేశారు.
ఈ విషయమై తాజాగా గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను లక్ష్యంగా చేసుకొని ఆరోగ్యమంత్రి టి హరీష్ రావు ట్విట్టర్ వార్ కు కూడా దిగారు. అయితే, పీఎంఎస్ ఎస్ వై స్కీం కింద వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమయానికి దరఖాస్తులు పంపలేదని, మంజూరు చేయకపోవడానికి అదే కారణం అంటూ గతంలో పార్లమెంట్ వేదకగా కేంద్రం ప్రకటించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో, పీఎంఎస్ ఎస్ వై స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు కేటాయించారంటూ ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం ఇచ్చింది. పీఎంఎస్ ఎస్ వై మొదటి మూడు విడతల్లో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని మెడికల్ కళాశాలలు, ఏ ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిందో తెలపాలంటూ కోరారు.
అందుకు సమాధానంగా, మూడు విడతల్లో దేశవ్యాప్తంగా 157 కళాశాలలు మంజూరు చేశామని కేంద్రం బదులిచ్చింది. ఏ దశలోనూ తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపలేదని ఆర్టీఐ ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. నాలుగో దశ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాలుగో విడత ఇంకా ప్రారంభించలేదని, రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు ఆహ్వానించలేదని స్పష్టం చేసింది. పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేసేబదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై శ్వేతపత్రం విడుదలచేస్తే ప్రజలకు స్పష్టత చేకూరే అవకాశం ఉంటుంది.