అరెస్టు చేసిన నేరస్తులను పోలీసులు కొట్టడం అనేది చరిత్రలో ఎన్నడూ ఎరగని విషయం ఇంత మాత్రం కాదు. చాలా సందర్భాల్లో నిజం రాబట్టడానికి పోలీసులు నేరగాళ్లను చితక్కొడుతుంటారు. దండం దశగుణం భవేత్ అనే సిద్ధాంతం పోలీసులకు తెలిసినట్లుగా మరి ఎవరికీ తెలియదు. నేరం చేశాడని అనుమానం ఉంటేనే పోలీసులు కొడతారు. నేరం చేశాడని కచ్చితంగా తెలిసి, నిందితుడు ఒప్పుకోకపోతే ఇంకా కొడతారు. నేరం చేసినట్లుగా ఒప్పుకునేదాకా కొడతారు. అయితే.. ‘నేరం’ అని ఇదమిత్థంగా నిర్వచించలేని తప్పుల విషయంలో ఏం చేస్తారు? కానీ, ఇలాంటివాటికి కూడా కొట్టదలచుకుంటే పోలీసుల వద్ద చాలా చాలా లెక్కలు ఉంటాయి. ఆ క్రమంలోనే రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు చెందిన, తమ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్న ప్రతిపక్ష నాయకులను కూడా పోలీసులు కొడుతున్నారు. అయితే ఈ నాయకులు అందరినీ ముహానికి ముసుగు వీరులతో కొట్టిస్తున్నారు. సరిగ్గా ఈ ముసుగు దగ్గరే అనేక అనుమానాలు రేకెత్తెుతున్నాయి.
ఈ దేశంలో తప్పు చేసినట్లు తెలియని వాడినైనా సరే చట్టము న్యాయస్థానము శిక్షించాల్సిందే తప్ప పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అనేది నీతి. కానీ పోలీసులు చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఈ నీతిని పట్టించుకుంటూ ఉంటారు. రాజకీయ అరెస్టుల విషయంలో ‘తప్పు చేయడం’ అని నిర్ధారణకు రావడానికి పెద్దగా విచారించి తెలుసుకోవలసినది పోలీసులకు ఉండదు. మందు ఆ మేరకు నిర్ణయానికి వచ్చిన తరువాత మాత్రమే అరెస్టు చేస్తారు. సో, కొట్టడంలో ముందు వెనుక ఉండదు.
అయితే తప్పు చేసిన నిందితుడిని కొట్టడానికి ముసుగువేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు అనుకోరు. ‘తాము చేస్తున్న పని కూడా తప్పే’ అనే భయం వారిని వెన్నాడుతున్నప్పుడు మాత్రమే.. తమ అస్తిత్వాన్ని కూడా దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి ముసుగులోకి వెళ్లిపోయిన తర్వాత.. తామెవ్వరో అవతలి వాడికి తెలిసే అవకాశం లేదని బోధపడిన తర్వాత.. ఇక వారిలోని పైశాచికత్వం జడలు విప్పుతుంది. అకారణంగా కొట్టడమే అయినా.. అందులో హద్దులు దాటి చెలరేగిపోతారు.
పోలీసుల్లో ఇలాంటి పైశాచికత్వాన్ని నిద్రలేపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక బద్ధమైన కృషి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీకి రాజకీయ ప్రత్యర్థులుగా ముద్రపడిన ఎవరైనా సరే.. వారి పట్ల వ్యక్తిగత కక్ష తరహాలో వైరం పెంచుకోవడం అనేది పోలీసులకు అలవాటుగా మారుతోందా? అనే సందేహమూ కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విపక్షనాయకులను నియంత్రిస్తున్న, అడ్డుకుంటున్న, నిర్బంధిస్తున్న, చితక్కొడుతున్న తీరుతెన్నులను గమనిస్తే.. పోలీసులు విధినిర్వహణ అనగా ఏమిటో మరచిపోయి.. వ్యక్తగత కక్షలుగా భావించే దారిలో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది.
అసలు ముసుగులు వేసుకుని వచ్చి కొట్టిన వాళ్లు పోలీసులో తెలియదు.. పోలీసుల రక్షణ వలయం తమ చుట్టూ ఉంటుంది గనుక.. ముసుగుల్లో పార్టీ కార్యకర్తలే వచ్చి కొట్టారో కూడా తెలియకుండా రాజకీయ కారణాలతో అరెస్టు అయిన వారు.. హింసను అనుభవిస్తున్నారు. ఈ ముసుగువీరుల ద్వారా.. అధికారం అనేది రాజకీయ ప్రత్యర్థుల మీద వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఒక అవకాశం అనే నిర్వచనం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.