నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూపులుగా చెలరేగుతూ ఉండడం..ఇలాంటి పరిణామాలను వ్యక్తిస్వామ్య పార్టీ నాయకత్వాలు కోరుకుంటాయి. పార్టీలో రెండు వర్గాలుండి, వారు బలమైన శక్తిగా తయారు కాకుండా తమకు విధేయులుగా ఉండడం ఆ హైకమాండ్ నాయకత్వాలకు అవసరం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ముఠాలు ముదిరి పార్టీకి సమాధి కట్టే పరిస్థితి కూడా దాపురిస్తే ఏం చేయాలి? అధినాయకులే చొరవ తీసుకుని, ఖచ్చితంగా వాటిని సర్దబాటు చేయడం ద్వారా పార్టీని కాపాడుకోవాలి. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఆ పని చేతకావడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి చేటుచేసేలా ముఠాలుగా మారిన నాయకులను వేరే నియోజకవర్గాలకు సర్దుబాటు చేయడం ద్వారా.. ఇటీవల కొన్ని చర్యలు తీసుకున్న జగన్, మైలవరం విషయంలో పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. అసలేమీ చేయలేకపోతున్నారని పార్టీలోనే చర్చ నడుస్తోంది. జగన్ అసహాయత, అసమర్థతకు మైలవరం ముఠాలు ఒక నిదర్శనంలా నిలుస్తున్నాయి.
మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మంత్రి జోగిరమేష్ తో విభేదాలు ఉన్నాయి. జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలోనే ఉంటూ, అక్కడి అధికారులను తాను శాసిస్తూ, అక్కడి పార్టీ వ్యవహారాల్లో వేలుపెడుతూ, తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ వసంతకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ విషయం అనేకమార్లు జగన్ దృష్టికి కూడా వెళ్లింది. కానీ జోగి రమేష్ మీద చర్య తీసుకోవడానికి, కనీసం మందలించడానికి కూడా జగన్ పూనుకోలేదు. జోగి రమేష్ మనం తయారు చేసుకున్న బీసీ నాయకుడు, మనం కాపాడుకోవాలి అంటూ వసంతకే సర్ది చెప్పాడు. ఆయన పార్టీ పట్ల విముఖంగా ఉన్నా.. బుజ్జగించి గడపగడపకు తిరిగేలా సర్దిచెప్పాడు.
అయినా సరే.. అక్కడ ముఠాకక్షలు సర్దుకోలేదు. జోగివర్గంతో వసంత తలనొప్పులు పడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సొంత పార్టీలోనే బ్లేడ్ బ్యాచ్‌లు, చెడ్డీ గ్యాంగ్‌లు తయారయ్యాయని, వీరంతా కలిసి తమ పనులతో పార్టీని నాశనం చేస్తున్నారని, పార్టీకి నష్టం చేస్తున్నారని వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనాంశం. వసంతను పిలిచి సర్దిచెప్పే జగన్.. ఒక్కసారైనా జోగి రమేష్ ను పిలిచి.. మైలవరంలో పార్టీ పరువు పోకుండా ఆయన గ్రూపును అదుపులో ఉంచుకోవాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత నిస్సహాయంగా ఎందుకు మిగిలిపోతున్నారు? ఈ సంగతి ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
ముఠాకక్షలు సర్దడంలో జగన్ నిస్సహాయుడేనా?
Saturday, November 16, 2024