ముగింపు దశకు చేరుకున్న షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

Wednesday, January 22, 2025

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపుదశకు చేరుకొంది. ఇప్పటికే 3700కి పైగా కిలోమీటర్లకుపైగా పూర్తి అయింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో యాత్ర కొనసాగుతుండగా, మార్చ్ 5న పాలేరు వేదిక ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఇక్కడి నుండే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలో మార్చి 5 న ముగింపు సభను నిర్వహించనున్నారు. 4111 కి.మీ మైలు రాయి వద్ద షర్మిల తన పాదయాత్రను ముగించనున్నారు. ఫిబ్రవరి 20న పాదయాత్ర… పాలేరు నియోజకవర్గానికి చేరుతుంది. మహబూబాబాద్,డోర్నకల్ నియోజక వర్గాల్లో పాదయాత్ర ముగించుకొని పాలేరులో అడుగుపెట్టనున్నారు షర్మిల. 14 రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో యాత్ర కొనసాగనుంది.

2021 అక్టోబర్ 20న సెంటిమెంట్‌గా చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టడమే కాకుండా, ముఖ్యమంత్రిగా అన్ని ప్రధాన కార్యక్రమాలను ఇక్కడినుండి ప్రారంభించేవారు. తెలంగాణలో కొత్తగా పార్టీ స్థాపించిన షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పై సహితం బాణాలు వదిలిపెట్టారు.

అయితే, ఆమె పాదయాత్ర తెలంగాణ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపిందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చెప్పుకోదగిన పేరున్న నాయకులు ఎవ్వరు ఆమెతో చేరలేదు. ఆమెను ఓ రాజకీయ శక్తిగా ఎవ్వరూ గురించడం లేదు. అయితే మధ్యలో ఆమె పాదయాత్రకు ప్రభుత్వం అడ్డుపడటం, ఆమె కోర్టు నుండి అనుమతి తెచ్చుకోవడం వంటి నాటకీయ సంఘటనల నడుమ హైదరాబాద్ లో అరెస్ట్ అయినప్పుడు స్వయంగా ప్రధాన మంత్రి మోదీ ఫోన్ చేసి ఆమెతో మాట్లాడటం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.

ఆమెను కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కోసం ప్రయోగిస్తున్నారని బలమైన అనుమానాలు మొదటి నుంచి వ్యాపిస్తున్నాయి. మోదీ ఫోనుతో అవి మరింతగా బలపడ్డాయి. పైగా, ఆమె పాదయాత్రను అడ్డుకున్నప్పుడు, ఆమెను అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు సహితం ఆమె పట్ల సానుభూతి చూపారు. ఆమెకు మద్దతుగా, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

కాగా, బిఆర్ఎస్ కు దూరమవుతున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమె పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సర్వత్రా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో స్వయంగా వైఎస్ విజయమ్మ, జగన్ మోహన్ రెడ్డిలతో భేటీలు జరపడం ఆసక్తి కలిగిస్తోంది. షర్మిల పాలేరు నుండి పోటీచేయాలనుకోవడం కేవలం శ్రీనివాసరెడ్డి మద్దతు లభిస్తుందనే భరోసాతోనే అని చెబుతున్నారు. లేనిపక్షంలో ఆమె సొంతబలంపై గెలుపొందడం అసాధ్యమని కూడా భావిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగసభలో శ్రీనివాసరెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలబడి, ఆమెకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles