2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా నుండి బుధవారం ప్రారంభించిన `వారాహి విజయ యాత్ర’లో `ముఖ్యమంత్రి పవన్’ అంటూ అభిమానులు నినాదాలు ఇవ్వడమే కాకుండా, `ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకుంటా’ అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొనడం ఆయన అసలైన రాజకీయ ఎత్తుగడను వెల్లడి చేస్తుంది.
మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు పోటీకి తగిన అభ్యర్థులను, నియోజకవర్గాలను గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. `వైసిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్’ అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలని చెప్పడమే గాని ఆ దిశలో నిర్దుష్టంగా ప్రయత్నాలు చేయడం లేదు. ఎన్నికల పొత్తు గురించి ప్రాథమికమైన కసరత్తు కూడా జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
`ఒంటరిగా పోటీ చేయడమా? పొత్తులు పెట్టుకోవడమా?’ అనే విషయం తర్వాత నిర్ణయిస్తామని చెప్పడం చూస్తే `వారాహి యాత్ర’లో లభించిన ప్రజాస్పందనను బట్టి ఉంటుందనే సంకేతం ఇచ్చారు. మొదటగా ఈ యాత్రను గోదావరి జిల్లాలో చేపట్టడం గమనిస్తే, ఈ ప్రాంతంలోనే తనకు ఎక్కువగా మద్దతు లభించగలదని అంచనా వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ప్రస్తుత జనసేనకు క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదని అంటూ 25 నుండి 30 సీట్లు మాత్రమే వదులుతామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 50 వరకు సీట్లు కావాలని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే వారాహి యాత్ర ద్వారా తన బలాన్ని ప్రదర్శించి, ఎక్కువ సీట్లు పొత్తులో డిమాండ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది.
గతంలో కర్ణాటకలో మాదిరిగా ప్రధాన పార్టీలు వేటికి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో 30-40 మంది ఎమ్యెల్యేలతో హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన విధంగా, ఏపీలో సహితం హంగ్ అసెంబ్లీ ఏర్పడితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగలరని జనసేన నేతలు అంచనా వేస్తున్నట్టు కనిపిస్తున్నది. పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ను `కాబోయే ముఖ్యమంత్రి’ అన్నట్లు ఆయన సోదరుడు నాగబాబు కూడా పేర్కొనడం గమనార్హం.
ఏదేమైనా, బహిరంగసభకు వైసిపి, టిడిపి నేతలకన్నా జనసమీకరణ లేకుండానే ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే సత్తువ పవన కళ్యాణ్ లో కనిపిస్తున్నాయి. అయితే ఆయన సభలకు వచ్చే జనం ఓటర్లు మాత్రం కారని 2019 ఎన్నికలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం 25- 30 సీట్లకు పోటీచేయాలన్నా బలమైన అభ్యర్థులు ఆ పార్టీలో కనిపించడం లేదు.
ప్రస్తుతం టిడిపికి సిట్టింగ్ ఎమ్యెల్యేలు గల పలు నియోజకవర్గాలను లేదా టీడీపీ కీలక నాయకులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను కేవలం `కాపు సామాజిక వర్గం’ ఎక్కువగా ఉన్నారని జనసేన వారు కోరుతున్నారు. ఆ విధంగా చేయడం వైసీపీకి అవకాశం ఇచ్చిన్నట్లే అవుతుందని టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతుల్లోనే ఉందని పవన్ కళ్యాణ్ కత్తిపూడి బహిరంగసభలో పేర్కొనడం గమనార్హం. అంటే ఇక్కడ జనసేనకు లభించే సీట్లను బట్టే తన రాజకీయ భవిష్యత్ ఉండనే సంకేతం ఇచ్చారు. ఈ జిల్లాల్లో అత్యధిక సీట్లలో పోటీచేయాలని పట్టుదల కూడా కనిపిస్తుంది. అయితే, టిడిపికి సహితం ఈ జిల్లాలో బలమైన పట్టు ఉన్న ప్రాంతాలు. పైగా, ఆ పార్టీకి బలమైన నాయకులు కూడా ఉన్నారు.