రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా 2018లో మాదిరిగా వరుసగా మూడోసారి కూడా విజయం సాధించాలని సిద్ధపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నది. ముందస్తు కోసమే మార్చిలో జరుగవలసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలోనే పూర్తి చేశారు.
అయితే, ముందస్తు కోసం అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికలకు సన్నాహాలు ఇంకా పూర్తి కాలేదని అంటూ ఎన్నికల కమిషన్ ద్వారా జాప్యం చేయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తలపడుతుందా అనే అనుమానాలు కేసీఆర్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తున్నది. పైగా, పార్టీకి బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోనే కనీసం 30 నియోజకవర్గాలలో పార్టీ శాసనసభ్యులు ప్రజలలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నలు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ విషయమై కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులను పిలిపించి బుధవారం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ముందస్తుకు వెళ్లే విషయమే కాకుండా, పార్టీకి ప్రతికూలంగా ఉన్న నియోజకవర్గాలలో ఎటువంటి వ్యూహం అనుసరించాలి కూడా చర్చించారని చెబుతున్నారు. వారిద్దరిని అత్యవసరంగా పిలిపించి కేసీఆర్ చర్చలు జరపడం బిఆర్ఎస్ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది.
ఆరు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో మధ్యలో కొందరు మంత్రులు, ఇతర ప్రముఖులను సహితం పిలిపించి మాట్లాడారని తెలిసింది. ఎన్నికలకు సన్నద్ధత గురించి అనుసరించ వలసిన వ్యూహాలు సహితం చర్చలలో వచ్చాయి. ప్రతికూలంగా ఉన్న నియోజకవర్గాలలో మంత్రులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించారు.
అదేవిధంగా త్వరలో జరుగుతున్న ఎమ్యెల్సీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో అనుసరించ వలసిన ప్రమాణాల గురించి కూడా చర్చించారు. ఏయే సామజిక వర్గాలకు ఏమేరకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే అంశాలను సహితం చర్చకు వచ్చాయి.
మంత్రివర్గంలో మార్పులు చేపట్టాలని, కొందరు మంత్రుల శాఖలు కూడా మార్చాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా హరీష్ రావును హోమ్ శాఖ తీసుకోమని కేసీఆర్ సూచించగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
ఏదేమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం గురించి ఓ నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తున్నది. ఈ విషయంతో ముడిపడివున్న అనేక అంశాలపై లోతుగా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నది.