రాష్ట్ర శాసన సభలకు గడువుకన్నా ముందుగానే ఎన్నికలు జరిపించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మే, 2024, తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్, 2023 వరకు గడువు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు సమాయత్తం కాకముందే ఎన్నికలు జరిపించడం ద్వారా మరోసారి ఎన్నిక కావచ్చని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మేరకు వ్యాపిస్తున్న కధనాలు వాస్తవమైతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏప్రిల్/మే, 2023లోనే తెలుగు రాస్త్రాలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వరుసగా గుజరాత్, కర్ణాటకలలో బిజెపి గెలుపొందితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభావం తెలుగు రాష్ట్రాలలో కూడా పెరిగే అవకాశం ఉన్నదని, లోక్ సభతో పాటు జరిగే ఎన్నికలు ఆయన కేంద్రంగా ఉంటాయని, అప్పుడు తమ ప్రాధాన్యత తగ్గుతుందని ముఖ్యమంత్రులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతంకు తెలుగు దేశం, జనసేనలు కలసి పోటీ చేసే ప్రమాదాన్ని నివారించమని భరోసాతో ఉన్న వైసిపి నాయకులు మారితే వ్యవధి ఇస్తే వారు కలిసే అవకాశం లేకపోలేదని, అప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. ప్రస్తుత రాజకీయ గందరగోళం నుండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తేరుకొని, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దపడే లోగానే ఎన్నికలు జరిగితే తాము ఏకపక్షంగా గెలుపొందవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో సొంత సామజిక వర్గానికి చెందిన నమ్మకస్తులను కీలక పదవులలో నియమించడం ద్వారా ఎన్నికలకు అనుకూలమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ సమాయత్తం చేసుకున్నట్లు కనిపిస్తున్నది. అదే విధంగా సుమారు 50 మంది ఎమ్యెల్యేలకు తిరిగి సీట్ ఇచ్చే ప్రశ్న లేదని ఇప్పటికే సంకేతం ఇచ్చారు. పార్టీలో తలెత్తుతున్న అసమ్మతి స్వరాలు బలపడే లోపుగానే ఎన్నికలు జరపాలని జగన్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు సహితం ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఏదోవిధంగా సర్దుబాట్లు చేసుకొంటున్నప్పటికీ వచ్చే ఏడాది కేటాయింపులు ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది. అందుకనే కొత్త బడ్జెట్ ను ప్రవేశపట్టే లోపుగానే ఎన్నికలు జరపాలని కూడా చూస్తున్నారు.
ఇక, మునుగోడులో గెలుపొందిన పెరిగిన బీజేపీ బలం కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తున్నది. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో తెలంగాణాలో అధికారంలోకి రావడం కోసం బిజెపి కసరత్తు చేస్తున్నది. ఇప్పటికిప్పుడు బిజెపికి అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లేరు. ఇతర పార్టీల నుండి బలమైన నేతలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవంక, ఎమ్యెల్యేల కొనుగోలు కేసుతో బిజెపి జాతీయ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. బిజెపి నాయకత్వం తేరుకొని, ఎదురు దాడి చేసే లోపుగానే ఎన్నికలకు వెళ్లడం ద్వారా వరుసగా మూడోసారి గెలుపొందాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల కోసం సహకరించే విధంగా పాలనా యంత్రాంగంలో సహితం వచ్చే నెల రోజుల్లో పెను మార్పులు చేయనున్నట్లు తెలిసింది.
సంక్రాంత్రికి నూతన సచివాలయం భవనాన్ని ప్రారంభించి, అక్కడి నుండి పాలన చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనవరి మధ్యలో అసెంబ్లీని రద్దు చేస్తే కర్ణాటక పాటు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోవంక, జగన్, కేసీఆర్ లకు ఎన్నికల సర్వేలు జరుపుతున్న సంస్థలు సహితం ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతుందని హెచ్చరించినట్లు సమాచారం.