ఉగాది లోపుగానే రాష్ట్ర శాసనసభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగా అనుకున్నప్పటికీ ఇప్పుడు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉగాదికి కాకుండా ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు నాడు నూతన సచివాలయం ప్రారంభోత్సవం పెట్టుకున్నది కూడా అసెంబ్లీ రద్దు ఆలోచనతోనే అని అందరికి తెలుసు.
అయితే, అసెంబ్లీని రద్దు చేస్తే, అనుకున్న విధంగా ఆరు నెలల లోపుగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుపుతుందా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక వంకతో యధాప్రకారం డిసెంబర్ లోనే ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెస్తుందా? అనే అనుమానాలు బిఆర్ఎస్ నాయకులలో వ్యక్తం అవుతున్నాయి.
అసెంబ్లీ రద్దును అవకాశంగా తీసుకొని, ఓటర్ల జాబితాలో అక్రమాలు వంటి ఏదో ఒక సాకును తెరపైకి తీసుకొచ్చి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అదే జరిగితే ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా బిజెపి చేతిలోకి వెడుతుందని ఆందోళన చెందుతున్నారు.
పైగా గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ సహితం బహిరంగంగానే ఇప్పుడే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే, ఇక పాలనా ఆమె చేతిలోకి వస్తే బిఆర్ఎస్ కు చుక్కలు చూపించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. రెండు, మూడు నెలల ముందు ఎన్నికలు జరిగినంత మాత్రం చేత అదనంగా ఒనగూరే ప్రయోజనం అంటూ ఏమీ లేదని, యధాప్రకారం జరిగితే అనుకోని ఇబ్బందులు రాకపోవచ్చని సన్నిహితులు కేసీఆర్ కు సూచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ లోగా జరిగే కర్ణాటక ఎన్నికలపై దృష్టి సారించి, అక్కడ బీజేపీ తిరిగి రాకుండా చేయగలిగితే దక్షిణాదిన ఆ పార్టీ నైతిక స్థైర్యం కోల్పోతుందని, ప్రజల దృష్టి సహితం ఆ పార్టీ నుండి పక్కకు తిరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే బిజెపి అగ్రనాయకత్వం మధ్యప్రదేశ్, రాజస్థాన్, చ్ఛత్తిస్ ఘర్ లపై ప్రధానంగా కేంద్రీకృతమైనా ఉంటుందని, తెలంగాణపై అంతగా దృష్టి సారించే తీరిక ఉండకపోవచ్చని కూడా భావిస్తున్నారు.
ఎందుకంటె, అక్కడ మూడు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పడడం బిజెపికి అత్యవసరం. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు గురించి పెద్దగా అంచనాలు లేవు. అందుకనే డిసెంబర్ లో ఎన్నికలు జరగడమే సానుకూలం కాగలదని కేసీఆర్ కు పలువురు సూచిస్తున్నల్టు చెబుతున్నారు.