తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నాయకులలో అసలు సమయపాలన పట్టించుకోని వారు ముఖ్యంగా ఇద్దరే. ఒకరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకరు. సమయానికి రారు. వచ్చాక సమయానికి కార్యక్రమం ముగించారు. మైక్ ముందుకు వస్తే పూనకం వచ్చిన్నట్లు విరామం లేకుండా ప్రసంగిస్తుంటారు. ఆ సమావేశం ఏదైనా ఒకే విధంగా మాట్లాడుతూ ఉంటారు.
ముఖ్యంగా వారి మీడియా సమావేశాలు సుదీర్ఘంగా ఉంటాయి. ఆ రోజు చెప్పాల్సిన, ప్రజలకు చెప్పాల్సిన విషయం చెప్పి పంపించడంగా కాకుండా ఆ విషయమై తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. వివిధ కారణాల చేత మంగళగిరి వద్ద టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుమారు నెలరోజులుగా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాలు జరపలేదు.
కాగా గత నాలుగైదు రోజులుగా రోజూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఒక రకంగా మీడియా ప్రతినిధుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇదివరలో మాదిరిగా సైబరాబాద్ ఏర్పాటుకు, ఐటీ రంగం అభివృద్ధికి తాను పడిన శ్రమను వివరించే ప్రయత్నం చేయకుండా ఈ సారి ఉపాధ్యాయుని అవతారం ఎత్తి, సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారు.
పైగా చార్ట్ లతో, ఓ బెత్తం వంటి దానిని పట్టుకొని అందులోని విషయాలను వివరిస్తూ తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన్నట్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారు. అసలు తన ప్రసంగాలను మీడియా వారు ఏమేరకు అర్థం చేసుకుపొంతున్నారో అన్నది కూడా చూడటం లేదు. మీడియాలో ఏమేరకు కవరేజ్ వస్తుందో, ఎంత స్పష్టంగా చెబితే ప్రజలకు నేరుగా సందేశం అందే అవకాశం ఉంటుందో ఆలోచిస్తున్నట్లు కనబడటం లేదు.
ఒకొక్కరోజు ఒకొక్క అంశాన్ని తీసుకొని, లోతైన తన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రోజు రాయలసీమ అభివృద్ధి గురించి వైసిపి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, ఇంకోరోజు సాగునీటి ప్రాజెక్టులు, మరోరోజు పోలవరం.. అలా ఒకొక్క అంశంపై పరిశోధక విద్యార్థులకు బోధించినట్లు చెబుతున్నారు.
టిడిపి నేతలు సహితం ఎవ్వరూ ధైర్యం చేసి అంతటి సమాచారం ఒకేసారి ఇవ్వడం వల్లన ప్రయోజనం ఉండదని చెప్పలేక పోతున్నారు. మీడియా సమావేశంలో గంటన్నర సేపు మాట్లాడటం వల్లన ప్రయోజనం ఉండదని, చెప్పాలనుకున్న అంశాన్ని స్పష్టంగా 30- 40 నిమిషాల్లో చెప్పడం మంచిదని ఆయన టీడీపీ మీడియా బృందం సహితం ఆయనతో చెప్పే సాహసం చేయడం లేదు.
ఈ విధంగా పార్టీ శిక్షణా తరగతులలో గాని, మహానాడు వంటి సమావేశాలలో గాని, ఎంపిక చేసిన వారి సమావేశాలలో గాని సవివరంగా వివరిస్తే వారు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడో, మీడియా సమావేశాలలోనే ఎటువంటి ప్రశ్నలనైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీడియాలో ప్రచారం పొందటంలో విశేష అనుభవం గల చంద్రబాబు నాయుడు ఈ విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ వారి సహనాన్ని పరీక్షించడం అసమంజసంగా ఉంది.