ఆయన స్వయంగా ఒక జర్నలిస్టు. సుదీర్ఘ కాలం వివిధ దినపత్రికల్లో చిన్నా పెద్దా హోదాల్లో పనిచేశారు. కేవలం ఆయన జర్నలిజం నేపథ్యం, అనుభవం ఉపయోపగపడతాయనే నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సొంత పత్రిక సాక్షి ప్రారంభించే సాహసం కూడాచేసి, ఆయననే సారథిగా నియమించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సలహాదారు పదవిలోకి వెళ్లిన ఆయన ఇప్పుడు మీడియా మీద రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరగడానికి తగ్గట్టుగా పరోక్షంగా పచ్చజెండా ఎత్తేస్తున్నారు.
సీబీఐ విచారణకు హాజరు కావాల్సిఉన్న అవినాష్ ఇంటినుంచి బయల్దేరి, మార్గమధ్యంలో తల్లికి అనారోగ్యం అనే సమాచారం రావడంతో పులవెందులవైపు మళ్లినప్పుడు.. మీడియా వాహనాలు కూడా ఆయనను అనుసరించాయి. కాగా, అవినాష్ కాన్వాయ్ లోని అనుచరులు దిగి, ఆంధ్రజ్యోతి విలేకరి , కెమెరామెన్ లపై దాడి చేయడం, వారి కెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది. దీనిమీద పోలీసు కేసు కూడా నమోదు అయింది. ఈదాడిని సలహాదారు సజ్జల కూడా ఖండించారు.
అయితే ఇదే సందర్భంగా సజ్జల చెప్పిన మాటలు చిత్రంగా ఉన్నాయి. ఆదాడి దురదృష్టకరం అంటూనే.. ‘నాయకుడు అన్నాక అభిమానులు ఉంటారు. వారంతా సంయమనంతో ఉండలేరు కదా? అలాంటి పరిస్థితిని తీసుకురావడం సరికాదు కదా’ అని వ్యాఖ్యానించారు. అంటే నాయకుల అనుచరులకు కోపం తెప్పించేలా మీడియా వ్యవహరించకూడదు కదా అని ఆయన ఉద్దేశం. అనుచరులకు కోపం వచ్చి మీడియాను చితక్కొడితే, అందుకు నాయకుడిని ఏమీ అనకూడదు, నాయకుడి మంచితనానికి మచ్చ రాకూడదు అని ఆయన విశ్లేషణగా కనిపిస్తోంది.
ఈ సిద్ధాంతం రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అందరికీ అర్థమైందంటే గనుక.. రాష్ట్రవ్యాప్తంగా మీడియా మీద విచ్చలవిడిగా దాడులు పెరుగుతాయి. ఎటూ వైసీపీ నాయకులు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో కించిత్ ప్రచారాన్ని కోరుకోవడం లేదు. హైదరాబాదులోజరిగిన దాడులు గనక ఇక్కడ కేసులు నమోదు అయ్యాయి గానీ.. ఏపీలో దాడులు జరిగితే కేసులు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో.. ‘‘మీడియా వల్ల అనుచరులు సంయమనం కోల్పోయారు’’ అనే ముసుగు కింద.. రాష్ట్రవ్యాప్తంగా ఎడాపెడా దాడులు జరిగినా ఆశ్చర్యం లేదు. స్వయంగా సజ్జల రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అలాంటి సంకేతం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.
మీడియాపై దాడులకు సజ్జల పచ్చజెండా?
Wednesday, December 18, 2024